జగిత్యాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి

జగిత్యాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలి
  • ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ శృతిఓజా కు  గురువారం లేఖలు రాశారు. పరిపాలనా సాలభ్యం కోసం గత ప్రభుత్వం నూతన జిల్లాలకు రూపకల్పన చేసి, కొన్ని కొత్త జిల్లాలలో ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లను ఏర్పాటు చేసిందని.. కానీ జగిత్యాలలో మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం వలన జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, మోడల్ స్కూల్ ల అధ్యాపకులు మూల్యాంకన విధులు నిర్వహించేందుకు దూర ప్రాంతమైన కరీంనగర్ కు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందులో వివరించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలతో పాటు, ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఇంటర్ స్పాట్  వాల్యుయేషన్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు తగిన వసతులు ఉన్నాయని ఆయన సూచించారు. తమ అభ్యర్థన మేరకు సీఎం  తోపాటు, ఇంటర్ బోర్డు కమిషనర్ కు లేఖలు రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఈ సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ - 475 జిల్లా శాఖ అధ్యక్ష,  కార్యదర్శులు కొట్టాల తిరుపతిరెడ్డి, అత్తినేని శ్రీనివాస్ మరియు అధ్యాపకులు కృతజ్ఞతలు తెలియజేశారు.