భయం గుప్పిట్లో లగచర్ల ... ఇంకా నిలిచిన ఇంటర్ నెట్ సేవలు
- గ్రామాల్లోమొత్తం ప్రత్యేక బలగాలు
- ఎప్పుడు.. ఎవరిని అరెస్ట్ చేస్తారనే భయాందోళనలు
- ఇప్పటికే ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్న వైనం
- మూడు రోజుల నుంచి నిర్మానుష్యంగా గ్రామాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్మా సిటీకి భూములు ఇవ్వమంటూ ఆందోళనకు దిగి.. అధికారులపై దాడి చేసిన ఘటన నుంచి ఇంకా ఆ మూడు గ్రామాలు తేరుకోవడం లేదు. ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తారో అనే భయంతో మూడు గ్రామాలు - నిర్మానుష్యంగా మారాయి. లగచర్ల ఘటనతో నాలుగు రోజులు దాటిపోతున్నా ఇళ్లకు వచ్చేందుకు పురుషులు జంకుతున్నారు. ఇక, మహిళలు, పిల్లలు సైతం పగలంతా పొలాల్లోనే గడుపుతున్నారు. లగచర్ల ఘటన తర్వాత అక్కడి మూడు గ్రామాల్లో జనసంచారం కనిపించడం లేదు. విచారణ పేరుతో పోలీసులు ఎప్పుడు వచ్చి ఎవరిని పట్టుకుపోతారోనని తీవ్ర భయాందోళనలతో గడుపుతున్నారు. సోమవారం ఘటన జరిగితే ఇప్పటికీ పురుషులు ఇళ్లకు రాకుండా దూర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
మహిళలు సైతం పిల్లలను తీసుకొని ఉదయం పొలానికి వెళుతున్నారు. సాయంత్రం వరకు అక్కడే గడిపి రాత్రికి బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకుంటున్నారు. లగచర్లలో అయితే కొద్ది మంది జనం అటూఇటూ తిరుగుతుండగా.. పులిచర్లకుంట తండా, రోటిబండ తండాలు శుక్రవారం వరకు కూడా నిర్మానుష్యంగానే కనిపించాయి. ఈ ఘటన తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 50 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ అనంతరం మంగళవారం 16 మందిని రిమాండ్కు తరలించారు. మిగిలిన 34 మందిని విడిచిపెట్టారు. దీంతో వీరంతా ఇళ్లకు చేరుకోవడంతో వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రధాన నిందితుడు సురేష్తో పాటు మరికొంత మంది పరారీలో ఉండగా.. ఇంకా ఆచూకీ చిక్కలేదు.
ఇంటర్నెట్ బంద్ ...
లగచర్లలో ఘటన జరిగిన తర్వాత సోమవారం రాత్రి 10 గంటల నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అప్పటి నుంచి ఆ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో మీ సేవ కేంద్రాల్లో సేవలు నిలిచిపోయాయి. అలాగే తహసీల్దార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఇంటర్ నెట్ గురించి కొందరు గ్రామాల నుంచి బయటకు వెళుతున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు కూడా అదే పరిస్థితి నెలకొన్నది.
ఊళ్ల నిండా పోలీస్ బలగాలే ...
రాష్ట్రంలో లగచర్ల ఘటన ఒక్కసారిగా రాజకీయాలను మార్చేసింది. కొన్నిచోట్ల ఇతర ప్రాజెక్టులకు కూడా రైతులు భూములు ఇచ్చే విషయంలో ఇదే పంథా అవలంభించాలని భావిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం అలాంటి ఆలోచన రావద్దనే ఉద్దేశంతో పోలీసులను మోహరించింది. మూడు గ్రామాల్లో భారీగా పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించాయి. దీంతో ఇండ్ల నుంచి బయటకు రాలేక బిక్కుబిక్కుమంటున్నారు.