కనకమామిడి వెంకన్న ఆలయ సందర్శనకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం
ముద్ర న్యూస్ బ్యూరో , హైదరాబాద్: కనకమామిడి లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నుంచి సహాయం అందించాలని ఆలయ కమిటీ నాయకులు టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ నాయకులు కోట్ల బల్వంత్ రెడ్డి, మల్ రెడ్డి గారి శ్రీనివాస్ రెడ్డి, గోవిందు రాఘవరెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, అంతిరెడ్డి గారి మోహన్ రెడ్డి తదితరులు గురువారం ఉదయం హైదరాబాదులో టిటిడి చైర్మన్ ను ఆయన నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.
కనకమామిడిలో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి టీటీడీ నుంచి గతంలో అందిన సహాయం గురించి వారు వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొండా లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వారు వివరించారు. టీటీడీ నుంచి మరింత ఆర్థిక సహాయం అందేటట్టు చూడాలని వారు ఈ సందర్భంగా కోరారు. కమిటీ విజ్ఞప్తి మేరకు ఆలయాన్ని సందర్శించడానికి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అంగీకరించారు.