జగిత్యాల అభివృద్ధిపై జీవన్ రెడ్డి చర్చకు సిద్ధమా.....?

జగిత్యాల అభివృద్ధిపై జీవన్ రెడ్డి చర్చకు సిద్ధమా.....?
  •  అన్ని వర్గాల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ మాత్రమే
  • పదేళ్లుగా అభివృద్ధి చేశాం
  • రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం
  • ప్రతి ఒక్కరూ తమవటు హక్కును తప్పక వినియోగించుకోవాలి
  • డా. సంజయ్ కుమార్ ను ఆశీర్వదించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించండి
  • బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ముద్ర ప్రతినిధి,జగిత్యాల: జగిత్యాల అభివృద్ధిపై జీవన్ రెడ్డి చర్చకు సిద్ధమా అని, అన్ని వర్గాల గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ మాత్రమేనని, పదేళ్లుగా అభివృద్ధి చేశాం.... రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, నవంబర్ 30న ప్రతి ఒక్కరూ తమవటు హక్కును తప్పక వినియోగించుకోవాలని, డా. సంజయ్ కుమార్ ను ఆశీర్వదించి మరోసారి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం సాయంత్రం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్లో బిఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి రాజేశం గౌడ్ తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్నారని, 2014 అనంతరం రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారని, అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనూ నెంబర్ వన్ గా నిలుస్తుందన్నారు. జగిత్యాలను జిల్లా కేంద్రం చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నామని, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో జగిత్యాల మెడికల్, ఎడ్యుకేషన్ హబ్ గా మారిందన్నారు.

బీడీ కార్మికులందరికీ రానున్న రోజుల్లో పెన్షన్లను అందిస్తామని, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా రూ.3 వేల సహాయం మహిళలకు అందిస్తామని, రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. మెరిసే ప్రతి వస్తువు బంగారం కాదని, నిత్యం ప్రజల కోసం పనిచేసే డా. సంజయ్ కుమార్ ను మరోసారి జగిత్యాల ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తే జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి మైనార్టీల ఇంటికి పిలవకుండా వెళ్తారని, వారు పెట్టిన బిర్యాని తింటారు కానీ వారి అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిందని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారు.

జగిత్యాల లో జరిగిన అభివృద్ధిపై జీవన్ రెడ్డి చర్చకు సిద్ధమా, చర్చ స్థలం ఎక్కడో చెప్పాలన్నారు. నిత్యం ప్రజల శ్రేయస్సు కోరే సీఎం కేసీఆర్ ను మరోసారి ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని, నవంబర్ 30న ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి జగిత్యాల ఎమ్మెల్యేగా డా. సంజయ్ కుమార్ ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గోలి శ్రీనివాస్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గట్టు సతీష్, మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.