మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి కష్టమేనా ...?

మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి కష్టమేనా ...?

నెల్లూరు జిల్లాలో వైసీపీకి పట్టున్న స్థానాల్లో ఉదయగిరి నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించగా బొల్లినేని రామారావు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.2019 ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం టీడీపీ ఉదయగిరి ఇన్‌చార్జిగా బొల్లినేని వ్యవహరిస్తున్నారు. కాగా ఉదయగిరి స్థానం నుంచి మేకపాటి 4 సార్లు ఎమ్యెల్యేగా (ఉపఎన్నికతో సహా) ఎన్నికయ్యారు. మేకపాటికి నియోజకవర్గంలో మంచి పలుకుబడి ఉంది. పైగా బలమైన సామాజిక వర్గానికి చెందినవారు. అయినా ఈసారి జరగబోయే ఎన్నికల్లో మాత్రం మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి ఎదురుగాలి తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలను అశ్రద్ధ చేస్తున్నారని, ఆయన రెండో భార్య శాంతమ్మ పెత్తనం చెలాయించడంతో కేడర్‌ అసంతృప్తిలో ఉన్నదని అంతర్గత సమాచారం. నియోజకవర్గంలో ఆమె పెత్తనం ఎక్కువైందని పార్టీ పదవులు ఇచ్చేందుకు నేతల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.ఓ రకంగా ఆమె షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడం పార్టీ నేతలకు నచ్చడం లేదని తెలుస్తున్నది. అనూహ్యంగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉదయగిరి వైసీపీ ఇన్‌చార్జిగా మేకపాటిని తొలగించి, ఆ స్థానాన్ని మరొకరికి కేటాయించాలని అధిష్ఠానానికి పార్టీ కేడర్‌ సూచించినట్లుగా సమాచారం.

మేకపాటికి టికెట్‌ కేటాయించాలా? వద్దా? అని సందిగ్ధతలో ఉన్న సమయంలో మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి మూడో భార్య అంశం తెరపైకి రావడంతో రాజకీయంగా ఆయనపై విమర్శలు జోరందుకున్నాయి. మేకపాటి తీరుతో ఉదయగిరిలో ఇప్పటికే పార్టీకి చెడ్డపేరు వచ్చిందని ఇక ఆయనను కొనసాగించకుండా మరొకరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది.కొద్దిరోజుల్లో ఉదయగిరి ఇన్‌చార్జి పోస్టు నుంచి మేకపాటిని తొలగిస్తారన్న సమాచారం నియోజకవర్గంలో పుకార్లు షికార్లు చేస్తున్నది. మూడో భార్య అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి చంద్రశేఖర్‌ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకుండా బెంగళూరులో ఉంటున్నారని తెలిసింది. ఆయనకు ఈసారి టికెట్‌ దక్కకపోవచ్చని తెలిసే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.ఉదయగిరిలో మేకపాటి తన అంతర్గత విషయాలతో సతమతమవుతూ అభివృద్ధిని గాలికి వదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి పోటీ చేసినా గెలుపు సాధ్యం కాదని టీడీపీ ధీమాగా ఉన్నదని తెలుస్తున్నది.చంద్రశేఖర్‌ రెడ్డిని కాదని వైసీపీ మరొకరికి టికెట్‌ కేటాయించేంత బలమైన నేతలు నియోజకవర్గంలో లేకపోవడం వైసీపీకి బలహీనత అని తెలుస్తున్నది. టీడీపీకి ఉదయగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందే లైన్‌క్లియర్‌ అయిందని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నట్లుగా సమాచారం.