ఉదయం రాజీనామా.. సాయంత్రం ప్రమాణస్వీకారం..

ఉదయం రాజీనామా.. సాయంత్రం ప్రమాణస్వీకారం..
  • రాష్ట్ర ముఖ్యమంత్రిగా 9వ సారి ప్రమాణం చేసిన జేడీయూ అధినేత
  • ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన కొన్ని గంటలకే బీజేపీ మద్ధతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు
  • ఎన్టీయేలో జేడీయూ చేరడం ఇక లాంఛనమే !

బీహార్ సీఎం పదవికి ఆదివారం ఉదయం రాజీనామా చేసిన జేడీయూ అధినేత నితీశ్ కుమార్ సాయంత్రం తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. విపక్షాల ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆయన ఆర్జేడీ పార్టీ మద్ధతును ఉపసంహరించుకుంటూ ఆదివారం ఉదయం రాజీనామా చేశారు. బీజేపీ మద్ధతుతో తిరిగి సాయంత్రం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

దీంతో బీహార్ ముఖ్యమంత్రిగా 9వ సారి ఆయన సీఎం ప్రమాణం చేసినట్టయ్యింది. నితిశ్‌తో పాటు జేడీయూ తరపున విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రావణ్ కుమార్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక బీజేపీ తరపున సామ్రాట్ చౌదరి, డాక్టర్ ప్రేమ్ కుమార్, విజయ్ సిన్హా, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) అధ్యక్షుడు డాక్టర్ సంతోష్ కుమార్ సుమన్, స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

గత కొన్ని రోజులుగా బీహార్ రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితి ఆదివారంతో తొలగిపోయింది. మీడియా రిపోర్టులు పేర్కొన్నట్టుగానే నితీశ్ కుమార్ విపక్షాల ఇండియా కూటమికి గుడ్‌బై చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చించారు. అనంతరం గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో 18 నెలల కిందట మద్ధతు ఇచ్చిన ఆర్జేడీకి నితీశ్ పెద్ద షాక్ ఇచ్చారు. ఆర్జేడీతో పొత్తును ముగించుకుని ప్రతిపక్ష కూటమి నుంచి వైదొలగుతున్నట్టు నితీశ్ కుమార్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడమే మిగిలి ఉంది.