జగన్‌ పోవాలి.. పవన్‌ రావాలి

జగన్‌ పోవాలి.. పవన్‌ రావాలి

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై మాజీ మంత్రి హరిరామజోగయ్య  విమర్శలు గుప్పించారు.  జగన్‌ పోవాలి.. పవన్‌ రావాలి అనేదే కాపు సంక్షేమ సేన లక్ష్యమని ఆయన అన్నారు. కాపు సేన ఏ ఇతర కులాలకు వ్యతిరేకం కాదని, జనసేనతో కలిసి పనిచేయాలని తమ కోరిక అని హరిరామజోగయ్య తెలిపారు. ఏపీని జగన్‌రెడ్డి సర్కార్‌ దోచుకుంటోందని, నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరిరామజోగయ్య పిలుపునిచ్చారు. దీనిపై అందరూ ఐక్యతతో పోరాడాలని హరిరామజోగయ్య పేర్కొన్నారు.  ఇటీవల తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని హరిరామజోగయ్య  స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓ సారి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణదీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు. కాపులకు రిజర్వేషన్‌పై జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్‌పై న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్‌  కోటా కింద కాపులకు 5శాతం రిజర్వేషన్‌ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు. కాపుల్లో వెనకబడినవారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా.. సీఎం జగన్‌ అడ్డుపడుతున్నారని పిటిషన్‌లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు.