జ‌న‌సేన అఖండ విజయం...

జ‌న‌సేన అఖండ విజయం...

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కల్యా నేతృత్వంలోని జనసేన పార్టీ సరికొత్త రికార్డు నమోదు చేసింది. పోటీ చేసిన అన్నిచోట్లా ఆ పార్టీ విజయం సాధించింది. పదేళ్ల రాజకీయ ప్రయాణంలో సరికొత్త విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గతేడాది కేవలం ఒక్కటంటే ఒక్క స్థానం గెలుపొందిన ఆ పార్టీ.. ఈసారి ఏకంగా పోటీ చేసిన 2 లోక్ సభ, 21 ఎసెంబ్లీ సీట్ల‌లో స్థానాల్లోనూ విజయం సాధించింది. తోక పార్టీ అంటూ విమర్శలు చేసిన వారికి ఈ విజయంతో గట్టి బదులిచ్చింది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ మొదటినుంచీ చెప్తూ వచ్చిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కీలక సమయంలో టిడిపి తో పొత్తు ప్రకటించారు. సీట్ల సర్దుబాటు సమయంలో ఆయన 24 స్థానాల్లో పోటీ చేస్తామని తొలుత ప్రకటించారు. తర్వాత మూడు స్థానాలు మిత్రపక్షాలకు విడిచిపెట్టారు. దీంతో కొందరు ‘సీనియర్‌’ నేతలు పవన్‌కు ‘ఉచిత’ సలహాలు ఇచ్చారు. ఆయనకు లేఖాస్త్రాలు సంధించారు. కానీ, వారి ‘పల్లకి మోత’లకు ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ తలొగ్గలేదు. వారికి సమాధానం కూడా ఇచ్చిందే లేదు. తన పనిని చేసుకుంటూ పోయారు. 21 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. అందరినీ ఒంటిచేత్తో గెలిపించుకోగలిగారు.