జస్టిస్ నర్సింహా రెడ్డి కమీషన్ పై కేసీఆర్ సంచలన ఆరోపణలు

జస్టిస్ నర్సింహా రెడ్డి కమీషన్ పై కేసీఆర్ సంచలన ఆరోపణలు
  • కమీషన్ కు 12 పేజీల లేఖ రాసిన మాజీ సీఎం కేసీఆర్

హైదరాబాద్- తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చ‌త్తీస్ ఘ‌డ్ నుండి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం విష‌యంలో అవకతవకలను వెలికితీసేందుకు ఏర్పాటు చేసిన విచార‌ణ క‌మిష‌న్ పై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. హైకోర్టు జ‌డ్జిగా రిటైర్ అయిన‌ప్ప‌టికీ మీరు స‌హ‌జ న్యాయ‌సూత్రాలు పాటించ‌టం లేద‌ని జస్టిస్ నర్సింహా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోళ్ల అంశంలో మాకు వ్య‌తిరేకంగా నివేధిక ఇవ్వాల‌న్న ఉద్దేశంతో మీరు ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోందని ఆరోపించారు. చ‌త్తీస్ ఘ‌డ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబందించిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ‌స్టిస్ న‌ర్సింహ‌రెడ్డి క‌మిష‌న్ ఇచ్చిన నోటీసుల‌కు కేసీఆర్ జులై 30 వ‌ర‌కు గ‌డువు కోరారు. ఐతే జస్టిస్ నర్సింహా రెడ్డి క‌మిష‌న్ జూన్ 15 వ‌రకే సమయం ఇస్తామ‌ని స్పష్టం చేసింది. దీంతో సీరియస్ గా స్పందించిన కేసీఆర్ కమీషన్ కు 12 పేజీల లేఖ‌ను రాశారు. 

మీ వ్యాఖ్య‌లు ఏవీ చూసిన గ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నివేధిక ఇవ్వాల‌న్న ఉద్దేశ‌మే కనిపిస్తోందని లేఖలో ఆరోపించారు కేసీఆర్. అలాంట‌ప్పుడు నేను ఏం చెప్పినా మీరు అర్థం చేసుకోర‌ని, న్యాయబద్దంగా నివేధిక ఇచ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని లేఖలో పేర్కొన్నారు. ఇప్ప‌టికే త‌ప్పు జ‌రిగిపోయింద‌న్న అంచనాకు కమీషన్ వచ్చినట్లు కనిపిస్తోందని, కేవ‌లం న‌ష్టాన్ని అంచ‌నావేయ‌ట‌మే మిగిలి ఉన్న‌ట్లుగా మీరు అబిప్రాయపడుతున్నారని నర్సింహా రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ అన్నారు. మా వైపు నుండి అభ్యంత‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబందించిన విచారణ నుంచి స్వ‌చ్ఛందంగా వైదొల‌గాల‌ని జస్టిస్ నర్సింహా రెడ్డికి సలహా ఇచ్చారు కేసీఆర్. దీంతో కేసీఆర్ లేఖపై, ఆయన చేసిన ఆరోపణలపై జస్టిస్ నర్సింహా రెడ్డి కమీషన్ తో పాటు రేవంత్ సర్కార్ ఏలా స్పందిస్తుందన్నదే ఆసక్తికరంగా మారింది.

Files