అడవి బిడ్డలకు కేసీఆర్ వరాల జల్లు

అడవి బిడ్డలకు కేసీఆర్ వరాల జల్లు
  • పోడు భూములకు పట్టాలు పంపిణీ 
  • రైతు బంధు వర్తింపు
  • పోడు భూముల కేసుల రద్దుకు ఆదేశాలు
  • మారుమూల గ్రామాల వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ కరెంట్ ఇవ్వాలి
  • మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మున్సిపాలిటీ లకు నిధులు
  • మళ్లీ మనమే గెలుస్తాం: ముఖ్యమంత్రి కేసీఆర్

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల (ఆసిఫాబాద్): ముఖ్యమంత్రి కేసీఆర్ అడవి బిడ్డలకు వరాల జల్లు కురిపించారు. దశాబ్దాలుగా ఉద్యమం చేస్తున్న పోడు భూములకు కేసీఆర్ మోక్షం కలిగించారు.  మహిళల పేరిట పొడుభూములకు హక్కు పత్రాలు శుక్రవారం అందజేశారు. ఆసిఫాబాద్ లో ప్రారంభించిన పట్టాల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చి రెండు మూడు రోజుల్లో అందరికి లభిస్తాయని కేసీఆర్ బహిరంగ సభలో ప్రకటించారు. ఈమేరకు పన్నెండు మంది రైతులకు పట్టాలు అందజేశారు. అడవి బిడ్డల హక్కుల కోసం జల్, జంగిల్, జమాన్ అంటూ నిజాంపై ఉద్యమించిన కొమురం భీమ్ గడ్డపై ప్రసంగించడం ఆనందంగా ఉందన్నారు. అడవిలో పోడు వ్యవసాయం చేసుకునే వారికి భూమి హక్కు ఇవ్వడంతో పాటు రైతు బంధు పథకం వర్తింప చేస్తున్నట్లు కేసీఆర్ హర్షధ్వానాలు మధ్య వెల్లడించారు. మహిళల పేరిట భూములు, పథకాలు వారికి వర్తింప చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పోడు భూముల కోసం జరిగిన పోరాటంలో నమోదు అయిన కేసులను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈమేరకు కేసుల రద్దు విషయాన్నీ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పరిశీలన చేయాలని సూచించారు. 

పోడు పట్టాలిచ్చి కేసులు ఉంటే అర్థం, పర్థం ఉండదని అన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇవ్వాలని భావిస్తున్నప్పటికి వారు 75 ఏండ్లుగా వ్యవసాయం చేస్తున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందని అందుకే జాప్యం జరిగుతోందని వివరించారు. మారుమూల గ్రామాల వ్యవసాయ బావుల వరకు త్రి ఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 300 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించడం జరిగిందని అయినప్పటికీ అనేక గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ సరఫరా కావడం లేదని ఆయన అన్నారు. ఎన్ని నిధులు ఖర్చు అయిన ఎస్.టీ. వెల్ఫేర్ నుంచి నిధులు కేటాయించి త్రీ ఫేస్ కరెంట్ సరఫరా చేయాలని ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు,  అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  దేశంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కంటెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదని అన్నారు. రైతులకు అనేక పథకాలు అమలు చేస్తుండడంతో  పొరుగున ఉన్న మహారాష్ట్ర వాసులు మన పథకాలు అమలు చేయాలని లేదా తెలంగాణ లో విలీనం చేయాలని అక్కడి పాలకులపై ఒత్తిడి చేస్తున్నారని గుర్తు చేశారు. మహారాష్ట్ర, తెలంగాణకు అనుసంధానం గా వంతెన నిర్మించి రవాణా సౌకర్యం కలిగించడంతో పాటు వార్ధా బ్యారేజ్ నిర్మించి ఆసిఫాబాద్, కాగజనగర్ నియోజకవర్గాలకు 80 వేల ఎకరాల సాగునీరు అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కొనప్ప కోరిక మేరకు కాగజనగర్ లో ఐటీఐ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నాగమ్మ  చేరువుపై బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేసుకున్నందున నిధులు కేటాయించి పర్యాటక కేంద్రంగా బాసిల్లే విధంగా సహకరిస్తానని అన్నారు. 

మున్సిపాలిటీలకు వరాలు
మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల పురపాలక సంఘాలకు ముఖ్యమంత్రి నిధుల వరాలు ప్రకటించారు. మంచిర్యాల జిల్లాలో ఏడు మున్సిపాలిటీ లు ఉండగా  ఒక్కో మున్సిపాలిటీ కి 25 కోట్లు, కాగజనగర్ కు 25 కోట్లు, కొత్తగా ఏర్పడనున్న ఆసిఫాబాద్ కు 25 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఒక్కో గ్రామ పంచాయితీకి 10, 20 లక్షలు మంజూరు చేస్తున్నానని తెలిపారు. అభివృద్ధి లో గ్రామ పంచాయతీల పాత్ర షాఘనీయమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి దశలో పయనిస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుచిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆరెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.