రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు
  • కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే 9 స్థానాలు కూడా వచ్చేవి కావు
  • రానున్న పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాల్లో గెలుపు ఖాయం
  • తుంగతుర్తి నియోజకవర్గంలోని మూడు వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటించిన ఎమ్మెల్యే
  • తుంగతుర్తి మార్కెట్ చైర్మన్ గా తీగల గిరిధర్ రెడ్డి తిరుమలగిరి మార్కెట్ చైర్మన్ గా పాలకుర్తి రామ తార శాలిగౌరారం మార్కెట్ చైర్మన్ గా పాదూరి శంకర్ రెడ్డి ల పేర్లు ఖరారు
  • తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
  • ఎమ్మెల్యే మందుల సామెల్

తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా సాగుతుందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ప్రజలు భావించి అధికారం కట్టబెట్టారని అదే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించినట్లయితే వచ్చిన 39లో 30 సీట్లు గల్లంతయి తొమ్మిది సీట్లు వచ్చేవని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని అన్నారు. అధికారం కోల్పోయి మతిభ్రమించి తిరిగి తామే అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారని అవి కలలుగానే మిగిలిపోతాయని అన్నారు.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందుతుందని అన్నారు .అందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలు లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తాయని అన్నారు .రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఇప్పటికి రెండు హామీలు అమలులో ఉన్నాయని మరో రెండు హామీలు శ్రీమతి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా అమలు కానున్నాయని అన్నారు. 500 కే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మద్దతుతో గెలిచిన వ్యక్తి అని అలాంటి ముఖ్యమంత్రిని పడదోయాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు .కెసిఆర్ పాలనలో ఉద్యమకారులను, దళితులను అనగదొక్కారని అన్నారు .టిఆర్ఎస్ పాలకులు అందిన కాడికి దోచుకున్నారని అన్నారు .రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని కాంగ్రెస్ పార్టీని ఓడించడం కేసీఆర్, కేటీఆర్ తరం కాదని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లోని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నియామకం చేపట్టామని తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా తీగల గిరిధర్ రెడ్డి, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గా పాలకుర్తి రామ తార, శాలిగౌరారం మార్కెట్ చైర్మన్ గా పాదూరి శంకర్ రెడ్డిని నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా వైస్ చైర్మన్ ల నియామకం కూడా సామాజిక సమతూకంతో ఎంపిక చేస్తామని అన్నారు. రానున్న కాలంలో తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు .ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.