కాపు నాయకులు  పెద్దన్నపాత్ర వహించాలి: పవన్‌ కల్యాణ్‌

కాపు నాయకులు  పెద్దన్నపాత్ర వహించాలి: పవన్‌ కల్యాణ్‌

మంగళగిరి: కాపు నాయకులు సమాజానికి పెద్దన్న పాత్ర వహించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాపు సంక్షేమ సేన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ సాధికారిత కావాలంటే కాపులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ''కులాలను విడగొట్టి లబ్ధి పొందే నాయకులు ఎక్కువయ్యారు. 2008–-09లో జరిగిన ఘటనలు నాలో పంతం పెంచాయి. ఉపాధి, ఉద్యోగాలు కావాలని అడిగే స్థితిలోనే ఇంకా ఉన్నాం. పెద్ద కులాలతో గొడవలు వద్దు.. అన్ని కులాలను సమానంగా చూడాలి. కాపులు కూడా కట్టుబాటు తీసుకోవాలి. సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు. కులం నుంచి నేను ఎప్పుడూ పారిపోను. సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారానికి దూరంగా ఉన్నారు. కాపులు అధికారంలోకి వస్తే మిగతావారిని తొక్కేస్తారని విషప్రచారం జరిగింది. సమాజాన్ని విడగొట్టేవారే ఎక్కువ.. కలిపేవారు తక్కువ.  ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోను.. నిర్మొహమాటంగానే ఉంటా. 

మీ ఆత్మగౌరవాన్ని తగ్గించను. వాస్తవిక ధోరణి ఎలా ఉందో దృష్టిలో పెట్టుకునే వ్యవహరిస్తా. జనసేనను నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించం. ఇతర పార్టీల అజెండా కోసం మేం పనిచేయం. రూ.వెయ్యి కోట్లతో రాజకీయాలు చేయలేం, పార్టీ నడపలేం. భావనాబలం ఉంటేనే పార్టీని నడపగలం. పార్టీని ఇంకా ప్రతికూల పవనాల మధ్యే నడుపుతున్నా. కాపులంతా నాకు ఓటేస్తే గాజువాక, భీమవరంలో గెలిచేవాడిని. ఓటర్ల వైవిధ్యమైన తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. పదేళ్లుగా అనేక మాటలు పడ్డా.. అవేమీ పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో రిజర్వేషన్‌ గురించి మాట్లాడినవారు ఇప్పుడెందుకు మాట్లాడరు? వైకాపా అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్‌ గురించి మాట్లాడారా? కాపుల వైపు నిలబడబోమని చెప్పినా ఓటేసి గెలిపించారు. కుల ఆత్మగౌరవాన్ని చంపుకొని మరీ వైకాపాకు ఎందుకు ఓటేశారు? 2024 ఎన్నికలు చాలా కీలకం. సంఖ్యాబలాన్ని అనుసరించి మన సత్తా చాటుకోవాలి. సంఘాలను ఐక్యం చేసుకుంటే దక్షిణభారత్‌లోనే పెద్ద పాత్ర పోషిస్తాం'' అని పవన్‌ కల్యాణ్ అన్నారు.