ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణ పనులు ప్రారంభం

ఖైరతాబాద్ మహాగణపతి నిర్మాణ పనులు ప్రారంభం

ముద్ర,హైదరాబాద్:-దేశ వ్యాప్తంగా ఖైరతాబాద్ మహాగణపతి కి ఎంతో ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి వినాయక చవితికి ఇక్కడ ఏర్పాటు చేసే భారీ గణనాధుడ్ని దర్శించుకోవడానికి లక్షలాది ప్రజలు తరలి వస్తారు. దేశంలోనే ఎత్తైన విగ్రహాన్ని ఖైరతాబాద్ లో ప్రతియేటా ఏర్పాటు చేస్తారు. విగ్రహం తయారీ.. ప్రతిష్టాపన.. పూజలు.. నిమజ్జనం ఇలా ప్రతి అంశంలోనూ ఖైరతాబాద్ వినాయకుని ప్రత్యేకతలు వేరుగా ఉంటాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించాలని నిర్వాహకులు నిర్ణయించారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితి వస్తోంది. ఈ క్రమంలో వినాయకుడిని తయారు చేయడం కోసం సోమవారం కర్రపూజ నిర్వహించారు. అంటే, భారీ గణనాధుని విగ్రహ తర్యారీ కోసం పనులు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈ కర్రపూజ వేడుకలో పాల్గొన్నారు. సంప్రదాయం ప్రకారం కర్రపూజ నిర్వహించి విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించినట్టు ఎమ్మెల్యే దానం తెలిపారు. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలిపారు. అందుకు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేస్తున్నామని దానం నాగేందర్ తెలిపారు. వినాయకుని ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం కోసం మరో రెండు, మూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.