యువతిని వేధించిన ఘటనతో లక్ష్మణ చాంద ఉద్రిక్తత

యువతిని వేధించిన ఘటనతో లక్ష్మణ చాంద ఉద్రిక్తత
  • డీఎస్పీ హామీతో శాంతించిన నిరసన కారులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఒక  వర్గానికి చెందిన యువతిని మరో వర్గం వారు వేధింపులకు గురి చేయటంతో ఇరు వర్గాల మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ తలెత్తింది. దీంతో నిర్మల్ జిల్లా లక్ష్మణ చాంద లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వేధింపులకు గురైన వర్గానికి చెందిన వారు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. చివరికి ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ఎస్పి జానకి షర్మిల సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళితే లక్ష్మణ చాందకు చెందిన ఒక వర్గానికి చెందిన యువకులు అనంత పేట వైపు వెళుతూ అక్కడే పంట చేలల్లో పని చేస్తున్న యువతిని వారికి కావాల్సిన చిరునామా అడిగారు. అంతటితో ఆగకుండా ఆమెను వేధించటం ప్రారంభించారు. దీంతో ఆమె తమ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని వేధిస్తున్న యువకులను అడ్డుకున్నారు.

దీంతో ఆ యువకులు లక్ష్మణ చాంద లోని తమ మిత్రులకు సమాచారం అందించి పిలిపించారు. వారు యువతి బంధువులపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా యువతి బంధువులకు చెందిన రెండు మొబైళ్లు, ద్విచక్రవాహనం తీసుకెళ్ళారు. దీంతో మామడ  మండలం లోని అనంత పేట, పొన్కల్, పోతారం గ్రామాల్లోని యువతి వైపు బంధువులు లక్ష్మణ చాంద లోని తమ మిత్రులకు సమాచారం ఇచ్చారు. వారు లక్ష్మణ చాంద మండల కేంద్రానికి చేరుకుని ధర్నా చేపట్టారు. అదే సమయంలో వేధించిన వర్గానికి చెందిన కొందరు మాటలతో రెచ్చగొట్టటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానిక ఎస్సై సుమలత నచ్చజెప్పినా ఫలితం లేక పోవటంతో సోన్ సిఐ వచ్చి నిరసన కారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మామడ, నిర్మల్ టౌన్, నిర్మల్ రూరల్ సీఐ లు, ఎస్సైలు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి సరిదిద్దారు. డీఎస్పీ గంగా రెడ్డి అక్కడికి చేరుకుని వివరాలు సేకరించిన నేపథ్యంలో వేధించిన వారు గంజాయి మత్తులో ఉన్నారని వివరించారు. డీఎస్పీ గంగారెడ్డి సదరు యువకులపై చర్య చేపడతామని హామీ ఇవ్వటంతో వారు శాంతించారు. దాదాపు రాత్రి 10.45 ప్రాంతంలో ఎస్పీ జానకి షర్మిల లక్ష్మణ చాంద పోలీస్ స్టేషన్ కు చేరుకుని వివరాలు తెలుసుకుని పరిస్థితి సమీక్షించారు.