ప్రాణాలు పోతున్నయ్! ప్రమాదకరంగా సర్కారు వైద్యం

ప్రాణాలు పోతున్నయ్! ప్రమాదకరంగా సర్కారు వైద్యం
Lives are lost! Dangerous government treatment
  • ఇప్పటికే పలువురు బాలింతలు మృతి
  • నల్గొండలో 70 శాతం మందికి ఇన్ఫెక్షన్​?
  • వివరాల సేకరణలో వైద్యారోగ్య శాఖ
  • శానిటేషన్, క్లీనింగ్ లోపమే కారణం
  • తరచూ విఫలమవుతున్న సిజేరియన్లు
  • మంత్రి మందలించినా మారని సిబ్బంది తీరు

మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో బాలింతలు తరచూ సిజేరియన్ ఇన్ఫెక్షన్లతో చనిపోతున్నారనే ఆరోపణలున్నాయి. సామూహిక మరణాలు సంభవించినప్పుడు మాత్రమే కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ‌ఇటీవల ఇక్కడ సిజేరియన్ చేయించుకున్న పది మందిలో సిరివెన్నెల, తన్నీరు శివాని అనే ఇద్దరు మహిళలు మృతిచెందారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నాక నలుగురు మహిళలు మరణించారు. ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో 34 మంది మహిళలకు ఆపరేషన్ చేశారు. నలుగురు మహిళలు తీవ్ర గ్యాస్ట్రో ఎంటెరిటిస్‌కు సంబంధించిన లక్షణాల గురించి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రులలో చేరారు. నలుగురూ మరణించారు. 

నిరుడు డిసెంబర్ లో 24 యేండ్ల గర్భిణి  ఐదు ప్రభుత్వ ఆసుపత్రుల తలుపులు తడుతూ 124 కి.మీ ప్రయాణించి చివరికి మహబూబ్‌నగర్ ఆసుపత్రి ఎదురుగా నవజాత శిశువు సహా మరణించింది. నగరంలోని పేట్లబురుజు ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళ మృతిచెందింది. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న తర్వాత అస్వస్థతకు గురైంది. వైద్యుల సూచన మేరకు బాధితురాలిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయింది. 

మలక్ పేట ఆస్పత్రిలో ఇదే నెలలో ఆరుగురు బాలింతలకు ఇన్ఫెక్షన్​ సోకింది. వారిని నిమ్స్ కు తరలించి వైద్యం చేయించారు. ఇటీవల మంచిర్యాల ప్రభుత్వాస్పత్రిలో ప్రసవించిన ఆరుగురు మహిళలకు ఇన్ఫెక్షన్​ సోకింది. వారంతా ప్రైవేట్​ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడంతో బతికారు. గతంలో మహబూబ్ నగర్​ ప్రభుత్వాస్పత్రిలో సిజేరియన్​ విఫలమై నలుగురు మహిళలు మృతి చెందారని ప్రచారం జరిగింది. ఈ విషయం బయటకు రాకముందే అక్కడి అధికారులు సద్దుమణిగించారు. ఇటీవల నల్గొండ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులలో సిజేరియన్లు చేయించుకున్న మహిళలు ఎక్కువగా ఇన్ఫెక్షన్​ కు గురైనట్లు విశ్వసనీయ సమాచారం. 

ముద్ర, తెలంగాణ బ్యూరో :
సర్కారు వైద్యం ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాలు ఫెయిల్​అవుతున్నాయి. సౌకర్యాలు లేకపోవడం, శానిటేషన్​ సమస్యలతో బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ‘ప్రభుత్వ ఆస్పత్రులకే రండి‘ అంటున్న ప్రభుత్వం.. అందుకు సరిపడా ఏర్పాట్లు చేయడంలో విఫలమవుతున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో కొందరు బాలింతలు చనిపోయారు. నల్గొండ జిల్లాలో తాజాగా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించిన 70 శాతం మంది బాలింతలకు ఇన్ఫెక్షన్​ సోకినట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్యం చేయించుకోగా, మరికొందరు ప్రైవేట్​ఆస్పత్రులకు వెళ్లినట్లు సమాచారం. దీనిపై వైద్యారోగ్య శాఖ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కానీ, అధికారులు మాత్రం దీని మీద నోరు విప్పడం లేదు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యధికంగా సిజేరియన్​ డెలివరీలు జరుగుతున్న రాష్ట్రంగా తెలంగాణ అపఖ్యాతి మూటగట్టుకుంది. దేశంలో సగటున 23.29 శాతం సిజేరియన్ డెలివరీలు జరిగితే, అత్యధికంగా మన రాష్ట్రంలో 54.09 శాతంగా నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వార్షిక నివేదికలోఈ వివరాలు వెల్లడించింది. 2020–21లో రాష్ట్రంలో 55.33 శాతం సిజేరియన్లు జరిగితే, ఆ తర్వాత యేడాదిలో 54.09 శాతం నమోదయ్యాయి. సిజేరియన్లను తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ  చెప్పుకుంటున్నా, ఆపరేషన్ కే  ప్రయారిటీ ఇస్తున్నట్లుగా రూఢీ అవుతోంది. 

సర్కార్ లో దవాఖానాలలోనే 
కాన్పులకు వస్తే సిజేరియన్లు చేయవద్దని టార్గెట్ పెట్టుకున్నా సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం విడుదల చేసిన రిపోర్టులో 2020–2021లో ప్రైవేటు ఆస్పత్రులలో 65.34 శాతం సిజేరియన్ డెలివరీలు జరిగితే, 2022 లో 61.08 శాతానికి తగ్గాయి. ప్రభుత్వ దవాఖానాలలో పరిస్థితి రివర్స్‌‌ అయింది. 2020–21లో 46.3 శాతం సిజేరియన్లు జరిగితే,  ఆ తర్వాతి యేడాది 47.13 శాతానికి సిజేరియన్లు పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రులలో సిజేరియన్లు ఫెయిల్​ అవుతున్నాయి. బాలింతలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ప్రతి జిల్లాకు పెద్దాస్పత్రులు వచ్చినా వైద్య సేవలు మాత్రం అంతంతే ఉంటున్నాయి. ఆస్పత్రుల నిర్వహణ అధ్వాన్నంగానే ఉంటోంది. బాలింతలు ఉండే వార్డులలో కూడా క్లీనింగ్ ఉండటం లేదు. దీంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఇటీవల మంత్రి హరీశ్ రావు తనిఖీ చేసిన ఓ జిల్లా ఆస్పత్రిలో శానిటేషన్​నిర్లక్ష్యం బయటపడింది. సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడం కూడా బాలింతలకు ప్రమాదకరంగా మారింది. ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా వికటించి చనిపోయిన సంఘటనలు నమోదైన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైద్యంపై ఓ వైపు మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు రోజువారీగా రివ్యూలు, జూమ్​ మీటింగులు పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, స్థానికంగా వైద్యసేవలు మాత్రం చాలా అధ్వాన్నంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు రావాలంటూ చెప్పుతున్నా.. అక్కడ సరిపడా ఏర్పాట్లు చేయడం లేదు. దీంతో సర్కారు దవాఖానాల్లో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. 

ఇందుకు కారణాలివే
కేవలం టార్గెట్ల కోసమే సిజేరియన్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. సరిపడా వైద్య సేవలు లేకున్నా, క్లీనింగ్ వంటి సౌకర్యాలు చేయకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. లేబర్​ రూములు సరిగా క్లీన్​ చేయకపోవడం, డెలివరీ చేసిన తర్వాత బేబీకి, మదర్ కు శానిటేషన్​ చేయడంలో లోపాలు, స్టాప్​ నర్సులు సరిగ్గా పట్టించుకోకపోవడం, మదర్​కు అప్పటికే ఉన్న ఇతర ఆరోగ్య సమస్యలు, గైనకాలజిస్టులు సరిగా కేర్​ చేయకపోవడంతో బాలింతలు ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారు. ఎక్కువ మంది పేషెంట్లు ఒకేసారి రావడం, స్టాఫ్​ తక్కువగా ఉండటం, టార్గెట్ల కోసం వేగంగా ఆపరేషన్లు చేయడం, ఆపరేషన్​ కు వాడే పరికరాలు రెగ్యులర్​ గా శుభ్రం చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ఫెక్షన్​ కంట్రోల్ టీమ్​మొద్దు నిద్రలో ఉంటున్నది. ఆరోపణలే.