కబ్జా కోరులను వదిలిపెట్టం.. తిన్నది కక్కిస్తాం

కబ్జా కోరులను వదిలిపెట్టం.. తిన్నది కక్కిస్తాం
  • ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఘాటు వ్యాఖ్యలు
  • ఎలిమినేడులో పంచాయతీ కార్యాలయం ప్రారంభం
  • కాంగ్రెస్ లో చేరిన సర్పంచ్ అశోక వర్ధన్ రెడ్డి


ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూముల కబ్జాలకు పాల్పడిన కబ్జా కోరులను వదిలిపెట్టే ప్రసక్తేలేదని తిన్నది కక్కిస్తామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో రూ. 25 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ నూతన భవనాన్ని బుధవారం ఎంపీపీ కృపెష్, జెడ్పీటీసీ మహిపాల్, స్థానిక సర్పంచ్ ఎడమ అశోక వర్ధన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవోలను అడ్డుపెట్టుకొని ఎంతోమంది బీఆర్ఎస్ నేతలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమార్కులు ఎవరిని వదిలిపెట్టరని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ గత ప్రభుత్వంలో అనేక భూ ఆక్రమణలు చోటుచేసుకున్నాయని చెప్పారు.

ప్రభుత్వ అధికారులు సైతం అక్రమాలకు పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని, తిన్నది కక్కిస్తమని అన్నారు. ఇప్పటికే ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, అందులో భాగంగా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు గ్యారంటీ లను అమలు చేసినట్లు చెప్పారు. ఈ నెలలోనే మరో రెండు పథకాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు, ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు వివరించారు. ప్రజల సహకారంతో వచ్చే ఐదేళ్లలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఎడమ అశోక వర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.