మళ్ళీ ఇంజనీర్ గా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..!

మళ్ళీ ఇంజనీర్ గా మారిన ఎమ్మెల్యే శంకర్ నాయక్..!
MLA Shankar Naik
  • దత్తత గ్రామం పై ఎంతో మక్కువ..
  • పి.హెచ్.సి సబ్ సెంటర్ కు సొంత ఖర్చులతో కాంపౌండ్ వాల్ నిర్మాణం 

(ముద్ర ప్రతినిధి -కేసముద్రం): పూర్వాశ్రమంలో ఇంజనీర్ గా విధులు నిర్వహించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే మళ్లీ ఇంజనీర్ గా మారారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ప్రహరీ గోడ నిర్మించాలని గ్రామస్తులు కోరారు. అంతకుముందే ఆ గ్రామాన్ని ఎమ్మెల్యే దత్తత తీసుకోవడంతో గ్రామస్తులు కోరిందే తడవుగా ప్రహరీ గోడ నిర్మాణ పనులకు అప్పటికప్పుడు ఎమ్మెల్యే శంకర్ నాయక్ చర్యలు చేపట్టారు.

వెంటనే తన ఇంజనీర్ ప్రతిభను చూపి ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మార్కింగ్ ఇచ్చి, అప్పటికప్పుడే ముగ్గు పోసి ప్రత్యేకంగా జెసిబి తెప్పించి పునాది తీయించారు. సొంత ఖర్చులతో ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన సిమెంట్, స్టీల్, ఇతర సామాగ్రిని సమకూర్చారు. అటు దత్తత గ్రామం ఉప్పరపల్లి పై మక్కువ చూపిన ఎమ్మెల్యే.. తనలోని ఇంజనీర్ ప్రతిభను చాటి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి ప్రహరీ గోడ నిర్మాణానికి పూనుకోవడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.