తాజ్ పూర్ లో కొమురయ్య  విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

తాజ్ పూర్ లో కొమురయ్య  విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి భువనగిరి: భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో  నిర్మించిన దొడ్డి కొమురయ్య బీసీ భవన్ ను, గ్రామంలో ఏర్పాటు చేసిన దొడ్డి  కొమురయ్య విగ్రహాన్ని  ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం , నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్, తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , రామకృష్ణ రెడ్డి , దూదిమెట్ల బాలరాజు యాదవ్ లతో కలిసి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  ఆవిష్కరించి ఘన నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో  ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం, భుక్తికోసం, విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం అని తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్మరణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య అని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని అన్నారు. అప్పట్లో నిజాం పాలనలో తెలంగాణలోని గ్రామాల్లో జాగీర్దార్లు, దేశ్ ముఖ్ లు, భూస్వాములు, దేశ్ పాండేలు మొదలైన దొరల దురాగతాల కారణంగా విసిగి వేసారిన ప్రజలకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టుల సంఘం ఒక దివిటీ లాగా కనిపించేది. 

దొడ్డి కొమరయ్య సోదరుడు దొడ్డి మల్లయ్య కూడా ఆంధ్రమహాసభ కమిటీ సభ్యుడిగా పనిచేసేవాడన్నారు. తన అన్న ప్రభావం చేతనూ, దొరల దురాగతాలు ఎదిరించడానికి ఆంధ్రమహాసభయే చక్కని వేదిక అని గ్రహించిన కొమరయ్య కూడా సంఘంలో చేరి దొరలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవాడు అని దొడ్డి కొమురయ్య త్యాగాలను గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తరువాతనే సీఎం కేసీఆర్ దయవల్ల  బీసీ కులాలు ఎంతో అభివృద్ధి చెందినవి అని  మరో సారి బీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి బీరు మల్లయ్య,  తాజ్పుర్ సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్, నాయకులు సామల వెంకటేష్, పుట్టా వీరేష్ యాదవ్ పాల్గొన్నారు.