గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని సి యం రేవంతు రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ   

గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని సి యం రేవంతు రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ   

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :  విదేశాల్లో ఉపాధి పొందుతూ, తెలంగాణ రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమ కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణా జిల్లాల నుండి నిరుద్యోగ యువత స్థానికంగా ఉపాధి లభించక, విధిలేని పరిస్థితులలో కన్నతల్లిదండ్రులకు, కట్టుకున్న భార్య, పిల్లలకు దూరంగా 10% వరకు నిరుద్యోగ యువకులు ఉపాధి నిమిత్తం గల్ప్  దేశాలకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఒకవైపు కుటుంబ సభ్యులకు దూరం కావటంతో మానసికంగా కృంగిపోతు, బలవన్మరణాలకు పాల్పడటం, అనారోగ్యాలకు, ప్రమాదాలకు గురి అవుతున్న పరిస్థితులలో ఆ కుటుంబాలను ఆదుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించేదని తెలిపారు. తెలంగాణా  రాష్ట్రం ఏర్పడిన తర్వాత విదేశాలలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తామని ఉద్యమ సమయంలో వివిధ రాజకీయ పార్టీలు పేర్కొని,  రాష్ట్రం ఏర్పడ్డాక ఈ 10 సంవత్సరాల కాలంలో దాదాపు 1000కి పైగా గల్ప్  దేశాలలో ఉపాధి పొందుతూ మరణించిన కుటుంబాలకు  కనీసం ఒక్క రూపాయి కూడా  ఆర్థిక సహాయం అందించకపోవడం  దురదృష్టకరమన్నారు.

తెలంగాణ నుంచి దాదాపు 15 లక్షలకుపైన గల్ప్  దేశాలలో ఉపాధి పొందుతున్నారని..  భారతదేశానికి గల్ప్ కార్మికుల నుంచి రూ.18000  వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం సమకూరి ఉంటుందని, గత రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16,000 కోట్లు ఆర్థికంగా ఆదాయం సమకూరినప్పటికి గల్ప్ కార్మిక కుటుంబాలకు కనీసం ఒక్క రూపాయి కూడా లాభం జరగక పోవడం దురదృష్టకరమని అన్నారు. గల్ప్ దేశాలలో ఉపాధి పొందుతున్న తెలంగాణా బిడ్డలు ఒకవేళ విదేశాలలో మరణిస్తే వారికి రూ.5లక్షలు ఆర్థిక సహాయం, విదేశాల నుండి తిరిగి వచ్చిన కార్మికులకు స్వదేశంలో స్థిరపడుటకు, స్వయం ఉపాది పథకాలలో, వారి పిల్లలకు విద్యా అవకాశాలలో రెసిడెన్సియల్ స్కూల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలలో,  గృహ వసతిలో ప్రాధాన్యత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కేరళా రాష్ట్రంలో లాగా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసేందుకు తగు నిర్ణయం తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు