పార్లమెంట్ ఎన్నికల్లో"వంశీ" గెలుపుకు వ్యూహం సిద్ధం..! 

పార్లమెంట్ ఎన్నికల్లో"వంశీ" గెలుపుకు వ్యూహం సిద్ధం..! 
  • మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార బాధ్యతల ఇంచార్జ్ సంపత్ కుమార్ 
  • ఈనెల 29వ తేదీ నుండి కాంగ్రెస్ వ్యూహం అమలు 
  • నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి 30 వేల మెజారిటీ ఖాయం 

ముద్ర/షాద్ నగర్: పాలమూరు పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపుకు వ్యూహం సిద్ధం చేశామని మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార ఇంచార్జ్, ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్వగృహంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చల్ల వంశీ చంద్రారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా వ్యూహ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు వివరించారు. ఈనెల 29వ తేదీ ఉదయం ఏడు గంటలకు చౌడమ్మ గుట్ట శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం నుండి పార్లమెంట్ ఎన్నికల కరపత్రాలతో ప్రచారాన్ని పెద్ద ఎత్తున ముమ్మరం చేస్తున్నట్టు చెప్పారు. షాద్ నగర్ అసెంబ్లీలో 30 వేల మెజార్టీకి తగ్గకుండా చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు సాధ్యపడుతుందని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వీర్లపల్లి శంకర్ గెలుపు లాగే వంశీచంద్ రెడ్డికి కూడా పెద్ద ఎత్తున ఓట్లు పడనున్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ రూపొందించిన వ్యూహం పెద్ద ఎత్తున అమలు చేసేందుకు వేచి చూస్తున్నామని అన్నారు. గతంలో అధికారం తమ చేతిలో లేకపోయినప్పటికీ అనేక వ్యూహాలతో పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీలలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న సత్తా ఉందని ఇప్పుడు వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం కూడా ఈ ఎన్నికల్లో చివరి అస్త్రంగా వ్యూహాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. తమ చేతిలో అనేక వ్యూహాలు, ఆయుధాలు ఉన్నాయంటూ వివరించారు. 6 గ్యారంటీలు రుణమాఫీ తదితర ఆయుధాలు తమ చేతిలో ఉండగా సరికొత్త వ్యూహంతో అటు బిజెపిని ఇటు బిఆర్ఎస్ పార్టీని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. గత పది ఏళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి కెసిఆర్ ఆయన కుటుంబం ఆర్థిక దోపిడీకి, పాలన విధ్వంసానికి పాల్పడిందని ఆరోపించారు. మరోవైపు బిజెపి మతపిచ్చితో విద్వేషాలను రెచ్చగొట్టి మరోసారి కేంద్రంలో అధికారం కోసం పాకులాడుతుందని వీటిని ప్రజల ముందు బయటపెట్టి కాంగ్రెస్ పార్టీని ఎలా గెలిపించుకోవాలో తమకు తెలుసని అన్నారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా వంశీచంద్ రెడ్డి గెలుపుకు పూర్తి కసరత్తు మొదలైందని ఈనెల 29వ తేదీ నుండి మరింత ఉధృతంగా వ్యూహాలను అమలు చేస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల కోడ్ వరుసగా రావడంతో 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేసేందుకు కొంత ఆటంకం ఏర్పడిందని, త్వరలోనే ఆరు గ్యారెంటీలతో పాటు రుణమాఫీ చేయబోతున్నామని దీమా వ్యక్తం చేశారు. 

 ఎన్నికల కోసమే హరీశ్వర్ రావు రాజీనామాకు డ్రామా.. 

పార్లమెంట్ ఎన్నికల కోసమే మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా డ్రామా ఆడుతున్నారని, వారి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, కాలం దగ్గర పడిందని గుర్తు చేశారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగానే మాజీ మంత్రి హరీశ్వర్ రావు సగం దిమాక్ తో రాజీనామాకు సిద్ధమయ్యాడని ఎద్దేవా చేశారు. రుణమాఫీ అమలు చేస్తామంటే హరీశ్వర్ రావుకు రోషం ఎందుకు పొడుచుకొస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే హరీశ్వర్ రావు ఏం చేస్తారో మీడియానే చూస్తుందని అన్నారు. హరీశ్వర్ రావుకు సగం దిమాక్ ఉందంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గుతుంటే, మరోవైపు బిఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కడుతుంటే సహనం కోల్పోతున్న బిఆర్ఎస్ నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నారని ఎద్దెవా చేశారు. ఈ రాబోయే ఐదేళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ ఇంకా ఏలాంటి పిచ్చి వేషాలు వేస్తుందో చూడాలి అని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, పార్లమెంట్ పర్యవేక్షకులు మధుసూదన్ రెడ్డి, జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు చెన్నయ్య సీనియర్ నేతలు చెంది తిరుపతి రెడ్డి, పురుషోత్తం రెడ్డి, అందె మోహన్, రవికుమార్ గుప్తా, మైనార్టీ నేత ఇబ్రహీం,సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, పి.రఘు, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, యువనేత అందే మోహన్ రవికుమార్ గుప్తా, ఖాదర్ గోరి, సయ్యద్ ఖదీర్ లింగారెడ్డిగూడెం అశోక్ లు పాల్గొన్నారు.