కాంగ్రెస్​ లో మైనంపల్లి చిచ్చు..!

కాంగ్రెస్​ లో మైనంపల్లి చిచ్చు..!
  • నిన్న మెదక్​, నేడు మల్కాజిగిరి
  • ఇద్దరు డీసీసీ అధ్యక్షుల రాజీనామా

ముద్ర, తెలంగాణ బ్యూరో :మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తంలో చేరిక మేడ్చల్​ కాంగ్రెస్​ లో చిచ్చుపెట్టింది. తన కుమారుడు రోహిత్​ కు మెదక్​ ఎమ్మెల్యే టిక్కెట్టు ఖరారు చేయని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పై ఉన్న అసంతృప్తితో గత నెల 28న ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్​ లో చేరిన మైనంపల్లి.. రోహిత్​ కు మెదక్,తనకు మల్కాజిగిరి  టిక్కెట్టు దాదాపు ఖరారు చేయించుకుని వచ్చారు. దీంతో మల్కాజిగిరి నుంచి పోటీకి ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్న మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆశలు అడియాశలయ్యాయి. దీంతో కాంగ్రెస్ ను వీడుతున్నట్టు సోమవారం ప్రకటించిన శ్రీధర్​.. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు పంపారు. మరోవైపు.. రోహిత్​ కు మెదక్​ టిక్కెట్టు ఖరారైనట్లు ప్రచారం జరుగుతుండడంతో ఆ స్ధానం నుండి పోటీకి సిధ్దమైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి సైతం ఈ నెల ఒకటో తేదీన కాంగ్రెస్​ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రెండ్రొజుల్లో ఇద్దరు డీసీసీ అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. రానున్న రోజుల్లో ఇంకొందరు నేతలు కాంగ్రెస్​ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో శ్రీధర్​, తిరుపతి రెడ్డి ఇంకెంత మంది పార్టీ వీడుతారోననే చర్చ హాట్​ టాపిక్​ గా మారింది.