సమ్మక్క జగిత్యాల జిల్లా పొలాస గ్రామ బిడ్డ

సమ్మక్క జగిత్యాల జిల్లా పొలాస గ్రామ బిడ్డ
  • ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క - సారలమ్మ  జాతర 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల :తెలంగాణ రాష్ట్రంలో పేరు గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ  మహా జాతర ఈనెల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు పూజారులు ప్రకటించారు. అడవి తల్లులను దర్శించుకుంటే చాలు..అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.  

                             

సమ్మక్క జగిత్యాల జిల్లా పోలాస వాసియే.. సమ్మక్క సారలమ్మ కు సంబంధించిన జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామస్తుల్లో వయోవృద్ధుల కథనం ఇలా ఉందని తెలంగాణ అల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు,సీనియర్ న్యాయవాది హరి ఆశోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుత  జగిత్యాలజిల్లా,జగిత్యాల రూరల్  మండలం లోని  పోలాస అప్పటి పొలవాస ను  12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు పాలించాడు. (ఈ గ్రామంలో సమ్మక్క-సారలమ్మ ల గుడి  ప్రాచీన కాలం నుంచి ఉంది)ఆ రాజు వేటకు వెళ్లినప్పుడు అక్కడ పులుల సంరక్షణలో  దివ్యకాంతులతో ఉన్న పసి పాపను చూసి గ్రామానికి తీసుకు వచ్చి సమ్మక్క అని పేరు పెట్టారు.ఆ పసిపాప గ్రామంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరిగాయి.యుక్త వయసు వచ్చిన సమ్మక్కను మేడారం పాలించే పగిడిద్ద రాజు తో వివాహం జరిగింది.పగిడిద్ద రాజు మేడ రాజుకు మేనల్లుడు.పగిడిద్దరాజు -సమ్మక్కలకు సారలమ్మ ,నాగులమ్మ కూతుర్లు.జంపన్న కుమారుడు గోవింద రాజులతో సారలమ్మ కు  పెళ్ళి చేశారు.మేడారం ప్రాంతం  గోదావరి నదికి దగ్గరగా ఉంటుంది.

ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన భూములను ఆక్రమించేందుకు కాకతీయ రాజు రుద్రదేవుడు మేడారం పై దండెత్తారు.మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కాకతీయుల శక్తికి పగిడిద్ద రాజు,సారలమ్మ,నాగులమ్మ,గోవింద రాజులు వీరమరణం పొందారు.శత్రువుల చేతికి చిక్కి చావడం ఇష్టం లేని జంపన్న అక్కడికి సమీపంలోని  సంపెంగ వాగు లోకి దూకి మరణించాడు.అప్పటి నుంచి ఈ వాగుని జంపన్న వాగుగా పిలుస్తున్నారు.భర్త,కొడుకు,అల్లుడు,కూతురు ల మరణ వార్త విన్న సమ్మక్క ఆందోళనకు లోను కాకుండా యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడింది.సమ్మక్క ధాటికి తట్టుకోలేక శత్రు వర్గంలో ఒకడు వెనుక నుంచి బల్లెంతో బలంగా పొడిచిండు.తన రక్తంతో తడిస్తే ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో నిండి పోతుందని  ఉద్దేశ్యంతో తన గాయానికి కట్టుకట్టుకొని  శత్రువులను హతమార్చుతూ మేడారం సమీపంలో ఉన్న చిలుకల గుట్ట వైపు పోతూ మార్గ మద్యంలోనే అదృశ్యమైనది.గిరిజనులు సమ్మక్క కోసం అడవి అంతా గాలించగా నాగ వృక్షం నీడలో  ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమల భరిణ కన్పించింది.గిరిజనులు ఈ భరిణను సమ్మక్క గా భావించి తమ కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకుంటూ జాతరచేసు కుంటున్నారు.మేడారం జాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్య స్నానాలు చేస్తారు..ఆ తరువాత సమ్మక్క సారలమ్మ మహా జాతరలో పాల్గొని పూజలు చేస్తారని హరి ఆశోక్ కుమార్ వివరించారు.రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు ఈ మహా జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.ఆసియా ఖండం లోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు  ఈ మహా జాతరకు ఆరు వేల ప్రత్యేక ఆర్టీసి బస్సులు ఏర్పాటు  చేసినట్లు మేడారం జాతర కోసం ప్రత్యేకంగా 60 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన బస్ స్టా0డ్  ప్రారంభోత్సవం లో  రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క ప్రకటించారు.