రామానుజ సేవా ట్రస్టు, జనహిత సేవా ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య శిబిరం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆసియాలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కర్మాగారం, ఎస్టీపీ అంబర్ పేట్ కార్మికుల కోసం, శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, జనహిత సేవా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కే.అశోక్ రెడ్డి, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్ , ఎస్టీపీ జి.ఎం సుబ్రమణ్యం, జలమండలి ఆఫీసర్ పీఏ మహేష్ కుమార్, రామంతపూర్ డివిజన్ జనరల్ మేనేజర్ సంతోష్ కుమార్ కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో ఆర్థోపెడిక్, జనరల్ ఫిజీషియన్, గైనకాలజీ విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
దాదాపు మూడు వందల మందికి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్, ఇసిజి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య సమస్యలను తెలుసుకుని, వారికి సరిపడ మందులను అందజేశారు. ఈ సందర్బంగా ఎస్టీపీ జీఎం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తమ సంస్థలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు, ఇలాంటి వైద్య శిబిరాలు మరి కొన్ని చోట్ల కూడా ఏర్పాటు చెయ్యాలని కోరారు.
ఈ వైద్య శిబిరం నిర్వహించడానికి సహకరించిన కిమ్స్ ఆసుపత్రి, భారత్ వికాస్ పరిషత్ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరం విజయవంతం అయిందని, కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేసిందని శ్రీ రామానుజ సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ధనుంజయ తెలిపారు.