సాగు నీటి ప్రాజెక్టులో మేటి కాంగ్రెస్ భట్టి విక్రమార్క

సాగు నీటి ప్రాజెక్టులో మేటి కాంగ్రెస్  భట్టి విక్రమార్క

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రచారపటాటోపం తప్ప ప్రాజెక్టులు నిర్మించింది లేదు... పంటలకు చుక్క నీరిచ్చింది లేదని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క దుయ్యబట్టారు. శనివారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  భట్టి మాట్లాడారు. తెలంగాణ లో ప్రాజెక్టులు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను భ్రమల్లో పెట్టారని విమర్శించారు. 18లక్షలు కోట్లు ప్రాజెక్టుల నిర్మాణం కు బడ్జెట్ లో కేటాయించిన కేసీఆర్ ఆ నిధులు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో కేవలం 69 వేల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించి 86 వేల ఎకరాల కు సాగునీరు అందించామని తెలిపారు. ధనిక రాష్ట్రం గా విలసిల్లిన ఉమ్మడి రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐదు లక్షల కోట్ల అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒకటవ తేదీ జీతాలు తీసుకునే వారని ఇప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి విప్లవం సృష్టించామని చెప్పడం విచిత్రంగా ఉందని భట్టి అన్నారు. సమసమాజ స్థాపనకు కృషి చేసి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడాలని అప్పుడే విప్లవం సాధించినట్లు అవుతుందని అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినా కేసీఆర్ లో పరివర్తన రాదని ఆయన దెప్పిపొడిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన పాదయాత్ర రేపటితో  మంచిర్యాల జిల్లాతో ముగుస్తుందని ఆయన తెలిపారు.

గత నెల 16వ తేదీన పెప్రిలో ప్రారంభించిన పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల మీదుగా కొనసాగిందని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా మారుమూల గ్రామాల ప్రజలు తనను ఆదరించి ఆశీర్వదించి నీరాజనాలు పలికిన తీరు తన హృదయాన్ని హత్తుకుందని జీవితంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను మరిచిపోలేనని ఆయన అన్నారు. పాదయాత్ర సందర్భంగా అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయని వాటిని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.  సాక్షాత్తు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఆదివారం పాదయాత్ర మంచిర్యాల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి పెద్దపల్లి జిల్లాకు చేరుకుంటుందని ఆయన తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్  మాట్లాడుతూ శుక్రవారం నాటి సత్యాగ్రహ సభ విజయవంతంకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్లో ఐకమత్యాన్ని చాటి చెప్పామని ఆయన తెలిపారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్లో గ్రూపులు లేవని సమైక్యంగా రాబోయే ఎన్నికల్లో అధికార పక్షాన్ని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు ఉప్పలయ్య, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు పెంట రజిత పాల్గొన్నారు.