కండువాతో పోలింగ్ బూత్ లోకి మంత్రి అల్లోల 

కండువాతో పోలింగ్ బూత్ లోకి మంత్రి అల్లోల 
  • ఫిర్యాదు చేయనున్న బిజెపి నేతలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ బి ఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వివాదంలో చిక్కుకోనున్నారు. పార్టీ గుర్తున్న కండువా కప్పుకుని పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఓటు వేశారు. ఈ ఘటనపై జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా బిజెపి నేతలు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో భాగంగా  గురువారం ఉదయం నిర్మల్ రూరల్ మండలం లోని ఆయన స్వగ్రామం ఎల్లపల్లిలో ఓటు వేసేందుకు మంత్రి అల్లోల వెళ్లారు. అలా వెళ్లిన సమయంలో ఆయన భుజంపై పార్టీ గుర్తు, పేరు, సీఎం బొమ్మ ఉన్న కండువా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నియమావళి కి ఇది పూర్తి విరుద్ధం. ఇలా పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన విషయం బయటకు రావడం, ఇందుకు సంబంధించిన ఫోటోలు పార్టీ కార్యకర్తలు వైరల్ చేయటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు రిటర్నింగ్ అధికారికి సమాచారం అందించినట్లు తెలిసింది. సంబంధిత పోలింగ్ కేంద్రం లోని ప్రిసైడింగ్ అధికారి ద్వారా  ఫిర్యాదు చేయించాలని సూచించినట్లు సమాచారం.