తరుగు పేరుతో రైతులను వేధిస్తే చర్యలు తప్పవు

తరుగు పేరుతో రైతులను వేధిస్తే చర్యలు తప్పవు
  • వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి

ముద్ర.వీపనగండ్ల :- ప్రభుత్వ ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తరుగు పేరుతో రైతులను వేధిస్తే అధికారులతో పాటు మిల్లర్లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గోవర్ధనగిరి, వీపనగండ్ల,సంగినేనిపల్లి గ్రామాలలో సెర్ప్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించి రైతుల ఖాతాలో వెంటనే డబ్బులు జమ అయ్యేలా చూడాలని సివిల్ సప్లై అధికారి రమేష్ బాబుకు చరవాణి లో సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి ఐకెపి సిబ్బంది వెంటనే రసీదులు ఇవ్వాలని, అందులో సూచించిన తూకం ప్రకారం  రైతులకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత అధికారులదేనని, ధాన్యాన్ని మిల్లులకు తరలించిన తర్వాత మిల్లర్లు ధాన్యాన్ని తరుగులు తీసివేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. రైతుల పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని,సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున ప్రభుత్వం బోనస్ అందజేస్తుందని అట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై చర్యలు లేవా..!

నకిలీ విత్తనాలు విక్రయించిన కంపెనీలపై పై అధికారులకు ఎందుకు ఫిర్యాదు చేయడం లేదని స్థానిక వ్యవసాయ అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన నక్క విష్ణు అనే రైతు గ్రామంలోని అగ్రో రైతు సేవా కేంద్రంలో  సన్న రకం వడ్లను కొనుగోలు చేసి తుకం పోసి వరి నాటగా ప్రస్తుతం కోతకు వచ్చిన వరి పంటలో కొన్ని సన్నాలు, కొన్ని లావు రకాలు ఒడ్లు వచ్చాయని మంత్రి జూపల్లి దృష్టికి రైతు విష్ణు తెచ్చారు. నకిలీ వడ్ల రకాలు వచ్చాయని వ్యవసాయ అధికారుల దృష్టికి తెచ్చిన పట్టించుకోవటం లేదని రైతు మంత్రికి వివరించారు. నకిలీ విత్తనాలు వచ్చాయని ఫిర్యాదు చేసిన ఎందుకు పై అధికారులు చెప్పి సంబంధిత కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని వ్యవసాయ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించే కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ను మంత్రి జూపల్లి చరవాణిలో ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో తూముకుంట సింగిల్ వింటర్ డైరెక్టర్ రామన్ గౌడ్, డిఆర్డిఓ ఉమాదేవి, ఏపిఎం బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరమ్ మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి, నాయకులు సుదర్శన్ రెడ్డి, నారాయణరెడ్డి, వెంకటస్వామి,డీలర్ బస్వరాజు, నక్క విష్ణు, రవీందర్ రెడ్డి,చిన్నారెడ్డి, గోపి, చక్ర వెంకటేష్, పెంటయ్య తదితరులు ఉన్నారు.