రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన కేటీఆర్‌

రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన కేటీఆర్‌
  • ఎలాంటి ప్రోటోకాల్‌ లేకుండానే  పర్యటన
  • సాధారణ కస్టమర్‌లా షాదాబ్ హోటల్‌, ఫేమస్ ఐస్ క్రీమ్ కు వెళ్లిన మంత్రి
  • బిర్యానీతోపాటు పలు రకాల వంటకాలు ఆరగింపు
  • కేటీఆర్‌ రావడంతో ఎగబడిన జనం 
  • హోటల్‌లో పలువురితో పలకరించి, ముచ్చట్లు

ముద్ర, తెలంగాణ బ్యూరో: పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర షాదాబ్  రెస్టారెంట్‌లో మంత్రి కేటీఆర్‌ కనిపించడంతో.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఎలాంటి హడావుడి లేకుండానే.. ఎలాంటి ప్రోటోకాల్‌ లేకుండా ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు సాదాసీదాగా వచ్చిన ఆయనను మెదట ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు. ఎవరైనా మంత్రి వస్తే.. మంత్రి వస్తున్నారంటూ కాన్వాయ్‌తోపాటు.. పోలీసుల హడావుడి ఉంటుంది కాని.. ఇలా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్‌ ఇవ్వడం చూసి షాక్‌ అయ్యారు. ఆయన బిర్యానీతోపాటు.. పలురకాల హైదరాబాదీ వంటకాల రుచి చూశారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం. మంత్రి కేటీఆర్ ను చూసిన పలువురు ఆయనను తమ టేబుల్ మీదికి ఆహ్వానించారు. మంత్రి రెండు కుటుంబాలతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా మంత్రితో మాట్లాడిన మైనార్టీ కుటుంబం హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన శాంతియుత వాతావరణాన్ని గంగాజమున తేహజీబ్ ను ప్రత్యేకంగా గుర్తు చేశారు. మహారాష్ట్ర నుంచి పర్యటనకు వచ్చిన మరో మైనార్టీ కుటుంబం మంత్రి కేటీఆర్ ని ప్రత్యేకంగా పలకరించారు. తమకు హైదరాబాద్ నగరం ఎంతగానో నచ్చిందని ఒకవైపు సాంప్రదాయ బద్ధమైన ప్రత్యేకతను కొనసాగిస్తూనే మరోవైపు ఆధునికతను సంతరించుకున్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడాలన్న ఆలోచన తమకు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదలైందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా వారి పాపతో మంత్రి కాసేపు మాట్లాడారు. హైదరాబాద్ పట్ల ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన వారికి ధన్యవాదాలు తెలిపారు.