చిన్న బాస్ వచ్చిండు!

చిన్న బాస్ వచ్చిండు!
  • విదేశీ పర్యటన నుంచి రాష్ట్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్
  • పలు సెగ్మెంట్లలో అభ్యర్థులు మారుస్తారనే ఆశలు
  • కీలక సమయంలో అందుబాటులో లేని కేటీఆర్
  • హైదరాబాద్ కు క్యూ కట్టనున్న ఆశావహులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్​పార్టీలో చిన్న బాస్ గా కొనసాగుతున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్​తన విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన రాక కోసమే పార్టీలోని పలువురు నేతలు  ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కేటీఆర్​తెలంగాణకు రావడంతో ఆశావహులంతా ఇపుడు నగరానికి పరుగులు తీయనున్నారు. 
 
అసంతృప్త నేతల్లో ఆగ్రహావేశాలు..
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తరపున 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా నాలుగు సెగ్మెంట్లు ప్రకటించాల్సి ఉంది. ఇందులో రెండు పాతబస్తీ పరిధిలోని నియోజకవర్గాలు కావడం విశేషం. మరో రెండు నర్సాపూర్, జనగాం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా టికెట్ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల్లో దాదాపు 90 శాతానికి పైగా అవకాశం దక్కలేదు. దీంతో పలు నియోజకవర్గాల్లోపార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తులు, ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు పార్టీ అధిష్టానం అనేక విధాలుగా యత్నిస్తున్నప్పటికీ  విబేధాలు మాత్రం సద్దుమణగడం లేదు. రోజురోజుకు ఇతర నియోజకవర్గాలకు కూడా పాకుతున్నాయి. దీంతో టికెట్ల జాబితాలో చోటుచేసుకున్న అభ్యర్థులకు, టికెట్లను ఆశించిన అశావహులకు మధ్య పొసగడం లేదు. అనేక నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులంతా రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి పనిచేస్తున్నారు. దీంతో ఇరువర్గాలు పోటాపోటీగా నిరసనలు, విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రత్యర్థుల కంటే సొంత పార్టీ నేతల నుంచే ముప్పు వాటిల్లో ప్రమాదం ప్రస్తుతం గులాబీలో నెలకొంది.
 
కేటీఆర్​సన్నిహితులకూ టిక్కెట్లు నిల్..
ఈ నేపథ్యంలో కేసీఆర్ తరువాత పార్టీలో అంతటి స్థాయిగల కేటీఆర్ రెండు వారాల తన విదేశీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్నారు. ఆయన రాకతో అభ్యర్థుల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలకు కూడా టికెట్లు దక్కలేదు. వారిలో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కచ్చితంగా పోటీ చేస్తారని భావించిన క్రిశాంక్ వంటి నేత కూడా ఉన్నారు. ఆ స్థానం పోటీ చేసే అవకాశాన్ని దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితకు కేసీఆర్ ఇచ్చారు. పార్టీలో అనేక మంది సమర్థులైన నాయకులు ఉన్నప్పటికీ అందరికీ పోటీ చేసే అవకాశం కల్పించలేకపోయామని కేటీఆర్ విదేశాల నుంచి కూడా ట్వీట్ చేశారు.  
 
సీఎం కేసీఆర్​యూ టర్న్?
115 మందితో ప్రకటించిన జాబితాపై ప్రజల్లోనూ పెద్దగా ఆదరణ లభించడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రకటించిన అభ్యర్థులపై పార్టీ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు నివేదికలను తెప్పించుకుంటున్నది. ప్రస్తుతం జాబితాలో చోటుదక్కించుకున్న అత్యధిక శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యవతిరేకత కనిపిస్తోందని నిఘా వర్గాలు సైతం కేసీఆర్ కు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయన కూడా కొంతమంది అభ్యర్థులను మార్చడమే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ అండదండలతో టికెట్లను దక్కించుకోవాలని ఆశావహులంతా ఊవ్విళ్లూరుతున్నారు. దీంతో వారంతా మళ్లీ  హైదరాబాద్ బాట పట్టనున్నారు. వారంతా ఇప్పటికే కేటీఆర్ కు ఫోన్ లో తమ ఆవేదనను వెళ్లగక్కారు. పార్టీ కోసం చేసిన సేవలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో  వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ సీఎంతో మాట్లాడిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆశావహులంతా కేటీఆర్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.