యాట కూర తిన్నంక  తోటకూర తిన్నట్లుంటది !!

యాట కూర తిన్నంక  తోటకూర తిన్నట్లుంటది !!

అడ్డాకుల సభలో మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, మహబూబ్ నగర్: అడ్డాకుల సభలో మంత్రి కేటీఆర్ తన చలోక్తులతో నవ్వులు పూయించారు.  మండలంలోని వేముల పొన్నకల్ లో కేటీఆర్ గురువారం యస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీ కంపెనీ రెండవ యూనిట్‌కు  భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘మంత్రి మల్లారెడ్డి మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే యాటకూర తిన్నాక.. తోటకూర తిన్నట్లు ఉంటది’ అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. పండుగలు, పబ్బాలకు గంగిరెద్దులవాళ్లు ఇంటి ముంగటకు వచ్చినట్టు బీజేపీ, కాంగ్రెస్ నేతలు వస్తారని ఎద్దేవా చేశారు. వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు.

కంపెనీల రాకడతో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన జరుగుతోందన్నారు. జీవశాస్త్ర విజ్ఞాన పెట్టుబడుల హబ్‌గా తెలంగాణ విరాజిల్లుతున్నదని చెప్పారు. అంతకు ముందు మంత్రి మల్లారెడ్డి  మాట్లాడుతూ నాడు పాలమూరులో నీళ్లు, కరెంటు, రోడ్లు లేవని అన్నారు. ఇపుడు జిల్లాను సస్యశ్యామలం అవుతోందని, వలసలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు కూడా అడిగే హక్కు లేదన్నారు. మంత్రి కేటీఆర్ విదేశాలలో పర్యటించి పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకొస్తున్నారన్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జాగలేదని, రెండో ఎయిర్ పోర్టు పాలమూరులనే కట్టవలసి వస్తదని అనడంతో మళ్లోసారి నవ్వులు పూశాయి.