కెసిఆర్ నాయకత్వంలోనే పేదల అభివృద్ధి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

కెసిఆర్ నాయకత్వంలోనే పేదల అభివృద్ధి: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్

దుండిగల్, ముద్ర: రాష్ట్రంలో పేదల అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పరిధిలోని దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటిని కట్టించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ పదివేల కోట్లతో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో 30 వేల   ఇండ్లను పేదలకు అందించామన్నారు. మరో 70 వేల మందికి త్వరలోనే ఇళ్లను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు గ్రేటర్ హైదరాబాదులో మొత్తం ఎనిమిది చోట్ల 13వేల 300 ఇండ్లను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు 470, దళితులకు 1923, గిరిజనులకు 655 కేటాయించగా ఇతరులకు 8650 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో మొదటి విడతలో 13 ఇండ్లను పంపిణీ చేయగా నేడు రెండో విడతలో 1800 మంది లబ్ధిదారులకు అందించారు డబుల్ ఇండ్ల  పంపిణీ విషయంలో ఎవరి వద్ద కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తి పారదర్శకంగా నిరుపేదలకు  లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక  చేసినట్లు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో  పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్ రూమ్ అందజేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్  లక్షమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అమలకు సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలకు మోచేతికి బెల్లం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రామలక్ష్మణులు ఎమ్మెల్యే వివేక్ ఎమ్మెల్సీ ఎంబిపూర్ రాజులు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శాసనమండలి సభ్యులు శంబిపూర్ రాజులు రామలక్ష్మణులులా కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఇలాంటి నాయకులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.  కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ అమోయ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పీ వివేకానంద, శాసనమండలి సభ్యులు, శంబిపూర్ రాజు, నవీన్ రావ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శరత్ చంద్రారెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ నీలా గోపాల్ రెడ్డి, దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.