మూసీ ప్రక్షాళనకు ప్రజాభిప్రాయసేకరణకు సిద్ధమా..?
- విపక్షాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్
ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న మూసినది ప్రక్షాళన విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమా అని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విపక్ష పార్టీలకు సవాలు విసిరారు. మూసీ ప్రక్షాళన కు కమిటీ వేస్తామన్న ఆయన అందులో బీఆర్ఎస్ నేతలకు కూడా చోటు కల్పిస్తామని చెప్పారు. మూసి ప్రక్షాళనను అడ్డుకుంటే ప్రత్యేక ఉద్యమం చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విపక్ష పార్టీలను హెచ్చరించారు. అమాయక ప్రజలను రెచ్చగొట్టి వారిని రోడ్ల మీదికి తీసుకువస్తారని మండిపడ్డారు. అవసరమైతే ప్రభుత్వం, నల్గొండ ప్రజలతో కలిసి రజాకార్లతో కొట్లాడినట్టు కొట్లాడుతామన్నారు.మూసి ప్రక్షాళనకు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా ఆ ప్రక్రియను పూర్తి చేసి తీరుతామన్నారు. మంగళవారం జూబ్లీహీల్స్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.కేసీఆర్, హరీష్, కేటీఆర్ నల్గొండ జిల్లాపై కక్ష కట్టారన్నారని ఆరోపించారు.మూసీ సుందరీకరణ మాత్రమే కాదనీ కోట్ల మంది బ్రతుకులను కాలుష్యం నుంచి కాపాడే శుద్ధీకరణ అన్నారు. రెండు దశాబ్ధాలుగా తాను ఫ్లోరైడ్, మూసీ శుద్ధీకరణ మీద పోరాటం చేస్తున్నానన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని ఉద్యమం చేసి తెలంగాణను తెచ్చుకుంటే..ఈ పదేండ్లలోనూ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందన్నారు.
నల్గొండ ఫ్లోరైడ్ కష్టం చెప్పుకుంటే తీరేది కాదనీ ఇక్కడ భూగర్భ జలాలను కాకుండా భూఉపరితలంపై ప్రవహించే జలాలను మాత్రమే శుద్ధి చేసి వాడాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర జలశక్తి సంస్థ గతంలో చెప్పిన విషయాలను గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదన్నారు. నల్గొండ భూగర్భంలో ఫ్లోరైడ్ ఇంకా జడలు విప్పుకొని కూర్చుందని తేల్చిందన్నారు. మూసీ పరివాహక ప్రాంత పరిధిలో వివిధ కంపెనీలు రసాయన వ్యర్ధాలను మూసీలోకి వదిలిపెడుతుండటంతో నది అంతా కాలుష్యంగా మారి నల్గొండ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదన్నారు. వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నదులను శుభ్రం చేసుకొని ప్రజలను వ్యాధులనుంచి దూరం చేసుకుంటుంటే మన దగ్గర ప్రతిపక్షాలు మాత్రం మూసీ ప్రక్షాళన ఎందుకని గగ్గోలు పెడుతున్నాయని మండిపడ్డారు. అయినా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను నరకప్రాయంగా మార్చిన మూసీ కాలుష్యాన్ని శుద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు మూసీ బాధితులను తెలంగాణ భవన్ కు పిలిపించుకొని తమది జనతాగ్యారేజీ అని సోషల్ మీడియాలో తిప్పుకుంటున్నారని మండిపడ్డారు. అసలు అది జనతా గ్యారేజ్ కాదనీ జనాన్ని ముంచే, జనాల్ని వంచించే గ్యారేజీ అన్నారు. అందుకే ఆ కారు గ్యారేజీకి పరిమితమైందని సెటైర్లు వేశారు. మూసీ నది కలుషితం కాని ప్రాంతాల్లోని పరిధిలో ఫాంహౌజ్‌లు కట్టుకున్న కేటీఆర్,హరీష్‌రావు, హైదరాబాద్‌కు 100 కి.మీ దూరంలోని ఎర్రవెళ్లిలో సువిశాల ఫాంహౌజ్ కట్టుకున్న కేసీఆర్‌లు వచ్చి ఒక్క నెల రోజులు మూసీ తీరాన ఉండిపోవాలన్నారు.
మూసీ ప్రక్షాళన కు కమిటీ వేస్తామన్న ఆయన అందులో బీఆర్ఎస్ నేతలకు కూడా చోటు కల్పిస్తామని చెప్పారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసిఆర్ కు మూసీ గురించి తెలియకపోవడం బాధాకరమన్నారు. ఓ వైపు ఫ్లోరిన్.. ఇంకో వైపు మూసీతో జిల్లా ప్రజలు ఇబ్బందులుపడుతున్నారన్న ఆయన మూసిని ప్రక్షాళన చేస్తేనే తమ జిల్లా ప్రజలకు విముక్తి కలుగుతుందన్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో పండే పంటలో ఐరన్ ఎక్కువ అని ప్రియాంకా వర్గీస్ ఇది వరకు ఇచ్చిన స్టడీ రిపోర్ట్ ను మంత్రి ప్రస్తావించారు.మానవత్వం ఉన్న మనుషులైతే మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తారని చెప్పారు.కేటీఆర్‌కు నల్గొండ జిల్లాపై అంత కోపం ఎందుకో అర్ధం కావడం లేదన్నారు. మూసీ ప్రక్షాళనలో ప్రజలను ఒప్పిస్తామన్న ఆయన బాధిత కుటుంబాలకు డబుల్‌బెడ్‌రూం ఇచ్చి వారిని ఆదుకుంటామన్నారు. మూసిని ప్రక్షాళన చేయాలని తాను 11 రోజులు దీక్ష చేశానన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వచ్చి మూసి తెలంగాణకు మరణ కారణం అయ్యిందని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్న సాగర్‌లో70 వేల కుటుంబాలను నీట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రధానితో పాటు కేంద్రంలో ఎందరో మంత్రులను కలిసి మూసీ శుద్ధీకరణకు నిధులు కేటాయించాలని వినతులు ఇచ్చానన్న ఆయన మూసీ ప్రాంతంలో తాను తిరగని ఇళ్లు, కేంద్రంలో కలవని నాయకుడు లేరన్నారు. మూసి ప్రక్షాళనకు నిధులు ఇస్తామని మాట ఇచ్చి మొఖం చాటేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు.