గత ప్రభుత్వం వైఫల్యం వల్లే తాగునీటి ఇబ్బందులు

గత ప్రభుత్వం వైఫల్యం వల్లే తాగునీటి ఇబ్బందులు
  • గోపాల్ దీన్నే రిజర్వార్ను పరిశీలించిన మంత్రి జూపల్లి
  • మాజీ మంత్రి బంధువు ఏర్పాటు చేసుకున్న 50 హెచ్పి మోటర్ ను వెంటనే తొలగించాలి

ముద్ర.వీపనగండ్ల:-గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో తాగునీటి కి కష్టాలు పడాల్సి వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్ మండలాలకు తాగునీటిని అందించే గోపాల్దిన్నె రిజర్వాయర్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రిజర్వాయర్ నుంచి సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని వినియోగిస్తుండగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఎగువ ప్రాంతం నుంచి ఈ మారు సరిగా నీళ్లు రాకపోవడంతో సాగునీటికి,తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తుంది.చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్ మండలాలలోని పలు గ్రామాలలో తాగునీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి.

తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. మంత్రి జూపల్లి రిజర్వాయర్లో నీటిని పరిశీలించిన అనంతరం సంబంధిత జూరాల అధికారులతో నీటి నిలువలపై ఫోన్లో మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులలో రోజురోజుకు నీటి నిలువలు తగ్గుతున్నాయని, ఎక్కడ కూడా తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు మంత్రి జూపల్లికి వివరించారు. గోపాల్ దిన్నె రిజర్వాయర్లో ప్రస్తుతమున్న నీటిని తాగునీటి అవసరాలకు వాడుకోవటానికి రైతులు సహకరించాలని మంత్రి జూపల్లి కోరారు. జిల్లాలోని ఓ మాజీమంత్రి రిజర్వాయర్లో తన బంధువు వ్యవసాయ పొలానికి ప్రత్యేక పైప్లైన్ ఏర్పాటు చేసుకొని 50 హెచ్ పి మోటార్ సాయంతో నీటిని తరలించకపోతున్న జూరాల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు రైతులు మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి జూపల్లి జూరాల అధికారులతో పాటు, విద్యుత్ ఎస్సీ తో ఫోన్లో మాట్లాడారు.

రిజర్వాయర్ బ్యాక్ వాటర్ లో వేసిన 50 హెచ్పి విద్యుత్ మోటర్ ను వెంటనే తొలగించాలని. అక్రమంగా చేసినట్లయితే వెంటనే కేసు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని ఎస్సిని ఆదేశించారు. అనంతరం రిజర్వాయర్ వద్ద మంత్రి జూపల్లి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాగునీటి అవసరాల కోసం జూరాల ప్రాజెక్టుకు ఐదు టీఎంసీల నీటిని కర్ణాటక ప్రభుత్వం ద్వారా నీటిని విడుదల చేయించడానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ద్వారా కోరటం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 0.4 టిఎంసిల నీటి నిల్వలు ఉన్నట్లు అధికారులు తెలిపారని, వేసవి కాలంలో చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్ మండలాలకు తాగునీటి అవసరాలకు 0.1 టిఎంసి నీళ్లు అవసరమవుతాయని, జూరాల నుంచి నీటిని వదిలేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ ప్రాంతానికి సింగోటం రిజర్వాయర్, జొన్నల బోగడ రిజర్వాయర్ ద్వారా తాగునీటిని అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నాలుగు నెలలు కావస్తుందని,గత సంవత్సరం వర్షాలు లేకపోవడం,గత ప్రభుత్వం ముందు చూపు లేకుండా నీటిని వృధా చేసిందని, అంతేకాక కృష్ణానదిలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నీళ్లు తరలించకపోయారని,విద్యుత్ అవసరాల కంటూ నీటిని వృధా చేశారని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం మండువేసవిలో కూడా గృహాలకు, పరిశ్రమలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్తును అందిస్తున్నామని, ప్రతిపక్ష పార్టీల నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి సాగు, తాగునీటి విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.ఎన్ని ఇబ్బందులు అయినా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి అన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, పానగల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు బాల్ రెడ్డి, వీపనగండ్ల మండల రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య, మాజీ సర్పంచులు గంగిరెడ్డి,బిచుపల్లి, రంజిత్ కుమార్,తిరుపతయ్య,కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు బొల్లారం సుదర్శన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి,నరసింహ, గోపి, బస్వరాజ్ గౌడ్, రవీందర్ రెడ్డి,మహేష్ నాయుడు, వెంకటయ్య, నక్క విష్ణు, వెంకట్రాజయ్య,వెంకటస్వామి, రాజు,భరత్ రెడ్డి తదితరులు ఉన్నారు.