రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటున్న మోడీ తెలంగాణకు ఏం చేశారు..?

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటున్న మోడీ తెలంగాణకు ఏం చేశారు..?
  • తెలంగాణకు ఇచ్చిన విభజన హామీ లు ఏమయ్యాయి..
  • తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నీకు ఎలా సహకరిస్తారు..
  • తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం..
  • కేసీఆర్ రాష్ట్ర సంపద ప్రజల అభివృద్ధికి పంచుతుంటే..
  • మోడీ దేశ సంపద తన దోస్తులకు దోచి పెడుతున్నాడు..
  • భూపాలపల్లి మహాధర్నాలో ప్రధాని మోడీ పై మంత్రుల ఫైర్.. 
  • సింగరేణి కోసం రాష్ట్ర ప్రజలంతా కలిసి కొట్లాడాలని పిలుపు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటున్న మోడీ తెలంగాణకు ఏం చేశారని, తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలు ఏమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మీకు ఎలా సహకరిస్తారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లు ఫైర్ అయ్యారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద శనివారం నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి మంత్రులతోపాటు ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నన్నపునేని నరేందర్, జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని, పుట్టమధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన మహాధర్నాలో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని అనడానికి బిజెపికి, ప్రధాన మంత్రికి సిగ్గుందా అంటూ ధ్వజమెత్తారు. పార్లమెంటులో అన్ని బిల్లులకు సహకరించలేదా అన్నారు. రైతులకు తెలంగాణను అన్యాయం చేస్తున్నారు కాబట్టే మేము మిమ్మల్ని విధానపరంగా వ్యతిరేకించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ చెప్పడం జరిగిందని, అందుకు తగిన విధంగా పోరాటాలు చేస్తామన్నారు. రైతులను ముంచి ఆదాయాన్ని అంబానికి దోచిపెడితే నీకు సపోర్ట్ చేయాలా, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు నీకు సపోర్ట్ చేయాలా అంటూ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలు ప్రజల కోసం తెలంగాణ కోసం జైలుకు పోయారని గుర్తు చేశారు. అవినీతి అధానీలను పక్కన పెట్టుకొని మోడీ అవినీతి గురించి మాట్లాడడం సిగ్గు మాలిన చర్య అని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, కవితలను విమర్శిస్తే ఊరుకునేది లేదని, వారిపై కూడా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు మా వెంట ఉన్నారని, తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తామని తేల్చి చెప్పారు. మొన్న మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని, నిన్న పేపర్ లీకులు చేసి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కుట్రపన్నారని, మా ఎమ్మెల్యేలను కొని మా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని, వాటన్నింటిని సీఎం కేసీఆర్ తన తెలివితేటలతో తిప్పి కొట్టారని స్పష్టం చేశారు. నీకు కుటుంబం ఉంటే, భార్య పిల్లలు ఉంటే బాధలు అర్ధమయ్యేవని చెప్పారు. తెలంగాణకు అన్యాయం చేస్తున్న నీకు ఎలా సహకరిస్తారని మా డబ్బులు తీసుకెళ్లి గుజరాత్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్న నీకు ఎలా సహకరిస్తామని ప్రశ్నించారు.

400 ఉన్న గ్యాస్ సిలిండర్ 1200 చేసినందుకు నీకు సహకరించాలా అని ప్రశ్నించారు. తెలంగాణలో సింగరేణి లాభాల బాటలో పయనిస్తుండడంతో, సింగరేణిలో నష్టాలు చూపి బొగ్గు గనులు వేలం వేసే కుట్రలు నిజం కాదా అని ప్రశ్నించారు. బిజెపిని కేంద్రంలో గద్దె దింపేవరకు వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని, 8 ఏళ్లలో ఒక గడ్డపార కూడా ఇవ్వలేదని ఆ పథకాన్ని ఎత్తివేస్తే కచ్చితంగా ఆ పాపం బిజెపిని వెంటాడుతుందని ధ్వజమెత్తారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా సిద్ధమేనని, కానీ సహకరించే ప్రసక్తే లేదని మండిపడ్డారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని వారు చెప్పారు పేపర్ లీక్ చేసిన దొంగ జైలుకు వెళ్తే ఆయనను మందలించాల్సింది పోయి అభినందించడం హాస్యాస్పదమన్నారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టే రోజు తొందరలోనే వస్తుందని, మీ ప్రవర్తన చూసి తెలంగాణ సమాజం అసహ్యించుకుంటుందని అన్నారు. పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ దొరికిన బండి సంజయ్ ని ప్రశంసించినందుకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల జెడ్పిటిసిలు, ఎంపీపీలు, పార్టీ లీడర్లు, సింగరేణి కార్మికులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.