మునుగోడు పై ఎమ్మెల్యే కూసుకుంట్లకు సవతి తల్లి ప్రేమ

మునుగోడు పై ఎమ్మెల్యే కూసుకుంట్లకు సవతి తల్లి ప్రేమ
  • నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి లేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటు
  • మునుగోడు రెవిన్యూ డివిజన్ తో పాటు మున్సిపాలిటీ చేయకుంటే బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇండ్లు ముట్టడిస్తాం
  • మునుగోడును రెవిన్యూ డివిజన్, మున్సిపాలిటీ చేయాలని మునుగోడు నియోజకవర్గ కేంద్ర హక్కుల సాధన సమితి రాస్తారోకో
  • మునుగోడుకు అన్యాయం చేస్తే ఎన్నికల్లో మునుగోడు సత్తా చూపిస్తామని ప్రభుత్వానికి సవాల్

ముద్ర ప్రతినిధి, నల్లగొండ:నియోజకవర్గ కేంద్రమైన మునుగోడుపై ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి సవతి తల్లి ప్రేమ ఉందని మునుగోడు నియోజకవర్గ హక్కుల సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు మండిపడ్డారు. పేరుకే మునుగోడు నియోజకవర్గ కేంద్రంగా ఉందని అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని మునుగోడును రెవెన్యూ డివిజన్ తో పాటు మున్సిపాలిటీగా చేయాలని మునుగోడు నియోజకవర్గ కేంద్ర హక్కుల సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో (ఇవాళ) గురువారం అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మునుగోడు కేవలం నియోజకవర్గం కేంద్రం పేరుకే పరిమితమైందని అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారహరంతో ఆయన సొంత స్వలాభాల కొరకే మునుగోడును ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ఏం చేస్తున్నారో వారికి అర్థమవుతుందని ప్రశ్నించారు మునుగోడుపై ఇంత వివక్షత చూపిస్తున్న సిగ్గు లేకుండా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వత్తాసు పలకడం ఏ మాత్రం సరికాదన్నారు. మునుగోడును రెవిన్యూ డివిజన్ తో పాటు వెంటనే మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేయాలని లేదంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఇండ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. అన్ని రకాలుగా వెసులుబాటుగా నల్గొండ డివిజన్లో ఉన్న మునుగోడును నూతనంగా ఏర్పాటు చేసిన చండూరులో కలపడం బాధాకరమన్నారు. మునుగోడుపై వివక్షత చూపిస్తున్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి రానున్న ఎన్నికల్లో మునుగోడు సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ చేశారు. కనీసం మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో 50 పడకల ఆసుపత్రి లేకపోవడం ప్రభుత్వానికే సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కేంద్ర హక్కుల సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, అఖిలపక్ష నాయకులు మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు పాలకూర నరసింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురిగి నరసింహ గౌడ్, నాయకులు జిట్టగోని యాదయ్య, పాల్వాయి చెన్నారెడ్డి, పందుల భాస్కర్, ఆరేళ్ల సైదులు, జిట్టగోని కృష్ణ, మేక ప్రదీప్ రెడ్డి, పందుల సురేష్, మహేష్, దినేష్, వెంకన్న, గోపి తదితరులు పాల్గొన్నారు.