భారత్ దిశ దశ మార్చిన మోడీ

భారత్ దిశ దశ మార్చిన మోడీ
  • మోర్చ బాధ్యులు బిజెపికి పిల్లర్స్
  • బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కేంద్రంలోని బిజెపి మోడీ 9 ఏళ్ల  ప్రభుత్వ పాలనలో  భారతదేశ దిశా దశ  మార్చిందని , విశ్వంలోనే దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు.మహాజన్  సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ మోర్చ సంయుక్త సమావేశం   రేకుర్తిలోని  జాడి బాల్ రెడ్డి సాయి మహాలక్ష్మి గార్డెన్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాణి రుద్రమ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ లోని  ఓబీసీ, ఎస్సీ ఎస్టి , మహిళా , మైనారిటీ ,  కిసాన్ , యువ మోర్చ, మైనారిటీ  లు మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు.   9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన మేలు, పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ను ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యాచరణతో ముందుకు సాగాలని వ్యాఖ్యానించారు.  మోర్చాలు సంగటితశక్తిగా నిలవాలన్నారు. భారతీయ జనతా పార్టీలో మోర్చాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు .   వివిధ వర్గాల అభివృద్ధి సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పార్టీకి అనుబంధంగా     బీసీల కోసం ఓబీసీ , దళితులు, గిరిజనుల కు  ఎస్సీ ఎస్టి మోర్చా,  రైతులకు కిసాన్ మోర్చా,  మైనార్టీలకు మైనార్టీ మోర్చా ,మహిళలకు మహిళా మోర్చా, యువత కోసం భారతీయ జనతా యువమోర్చా ల విభాగాలు ఏర్పడ్డాయన్నారు . ఆయా వర్గాల సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాల్సిన బాధ్యత ఆయా మోర్చల పైనే ఉందన్నారు. ముఖ్యంగా మోర్చా బాధ్యులందరూ ఇట్టి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పథకాలపై అవగాహన కలిగి ఉండి, విస్తృతంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. 

ప్రతి గ్రామంలో ఆయా వర్గాలకు చెందిన ప్రజానీకానికి బిజెపి మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించే బాధ్యతను మోర్చాలే తీసుకోవాలన్నారు. మోర్చాలు మరింత బలోపేతం కావాలని, రాజకీయ సంఘటితశక్తిగా నిలవాలన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం తీసుకున్న చారిత్రక , సాహసోపేత నిర్ణయాలను ప్రజలందరికీ వివరించాలన్నారు. అందులో ముఖ్యంగా370 ఆర్టికల్, ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా , త్రిబుల్ తలాక్ అయోధ్య రామ మందిరం , వన్ నేషన్ వన్ రేషన్, నోట్ల రద్దు , స్వచ్ఛభారత్ , డిజిటల్ లావాదేవీలు ,  మేకిన్ ఇండియా , విదేశాంగ విధానం , ఆత్మ నిర్బర్ భారత్ ,  220 కోట్ల ఉచిత  కరోనా వ్యాక్సిన్ దోసులు , ఆయుష్మాన్ భారత్ , 80 కోట్ల మందికి మూడేళ్లుగా ఉచిత రేషన్ బియ్యం, నూతన విద్యా విధానం లాంటి నిర్ణయాల ను ప్రజల మధ్యలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు.

9 ఏళ్ల బిజెపి మోడీ ప్రభుత్వ పాలనలో దేశం విశ్వ ఖ్యాతి ని పొందిందని, 70 ఏళ్లలో జరగనివి 9 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేసి చూపెట్టిందని, సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ బిజెపి ప్రభుత్వం ఆలోచన విధానంతో  మోడీ ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వ పథకాలను పవర్  ప్రజెంటేషన్ ద్వారా   ఒక్కొక్క పథకాన్ని  సమగ్రంగా మోర్చాలకు వివరించారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  సమావేశాన్ని ఉద్దేశించి , సంస్థాగత విషయాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు   గుగిల్లపు రమేష్ , కొరటాల శివరామకృష్ణ , కోమల ఆంజనేయులు , రాజేంద్రప్రసాద్ , కోమటిరెడ్డి రామ్  గోపాల్ రెడ్డి, పుల్లెల పవన్ , ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి  శ్రీనివాస్ గౌడ్ , కళ్లెం వాసుదేవ రెడ్డి , కరీంనగర్ అసెంబ్లీ కన్వీనర్ దుబాల శ్రీనివాస్, దళిత మోర్ఛ రాష్ట్ర అధికార ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.