దేశాన్ని మోడీ... రాష్ట్రాన్ని కేసీఆర్ అమ్మేస్తున్నారు

దేశాన్ని మోడీ... రాష్ట్రాన్ని కేసీఆర్ అమ్మేస్తున్నారు
  • కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు
  • అపరిమిత సంపద కేసీఆర్ కు ఎక్కడిది
  • ప్రశ్నించిన సీఎల్పీ లీడర్ భట్టి

మంచిర్యాల: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దేశాన్ని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఆత్మీయులకు విక్రయిస్తూ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తున్న తోడు దొంగలని సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. బుధవారం శ్రీరాంపూర్ లోని ప్రగతి స్టేడియంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మోడీ, కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తూ దేశాన్ని తిరోగమనం వైపు తీసుకుపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి పరుడంటూ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి నరేంద్ర మోడీ బహిరంగ సభల్లో ఆరోపణలు చేస్తాడని కేసీఆర్ పై విచారణ విచారణ జరిపించి చర్యలు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కోల్ ఇండియా సంస్థ బొగ్గు గనులను ఇందిరాగాంధీ జాతీయం చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్ ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తున్నారని విమర్శించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఆందోళన చేస్తున్నాయని అన్నారు. పార్లమెంట్లో బిజెపి తీసుకువచ్చిన బొగ్గు గనుల ప్రైవేట్ పరం బిల్లుకు అప్పటి టీఆరెస్ ఎంపీలు అనుకూలంగా ఓట్లు వేసి ఇప్పుడు ఉద్యమం చేయడం లో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న బొగ్గు గనులను తిరిగి స్వాధీనం చేసుకొని ప్రజలకు అంకితం చేస్తామని ప్రకటించారు. బొగ్గు గనులను ఎవరు కూడా కొనుగోలు చేయవద్దని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన ఆసైన్డ్ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని వాటిని విక్రయిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ను కట్టడి చేయకపోతే సింగరేణి తో పాటు తెలంగాణలోని అన్ని భూములను విక్రయించి చివరకు రాష్ట్రాన్ని కూడా అమ్ముతాడని ఆయన ఆరోపించారు.

పరిపాలన కోసం ప్రజలు అధికారం ఇచ్చారు తప్ప ప్రజల ఆస్తులు అమ్మకానికి పెట్టడానికి కాదని ఆయన హితవు పలికారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి మొదలుకొని అన్ని రకాల పరీక్షల పత్రాలు లీకేజీ అయ్యాయని ఆయన అన్నారు. నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే టిఎస్ పీఎస్ సీ బోర్డును రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు. బీఆరెస్ దేశంలోనే అతి సంపన్నమైన పార్టీగా అనతి కాలంలోనే ఎదగడం దేశాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోందని అన్నారు. విపక్షాల చైర్మన్ గా చేస్తే ఎన్నికల్లో అన్ని పార్టీలకు డబ్బు ఖర్చు చేస్తానని కేసీఆర్ చెప్పడం చూస్తే ఆయన దగ్గర సంపద అపరిమితంగా ఉన్నట్లు స్పష్టమవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తనకు ఇల్లు తప్ప ఏమి లేవని ప్రకటించిన కేసీఆర్ కు ఇంత సొమ్ము ఎక్కడిదని ఆయన నిలదీశారు.

ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో ఉక్కు కర్మాగారాన్ని కొనడానికి అధికారులను పంపించడంలో ఏదో మతలబు దాగి ఉందని ఆయన సంశయాన్ని వ్యక్తం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టి కాళేశ్వరం నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని ఆయన మదనపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈనెల 14వ తేదీన మంచిర్యాలలో శివారులో జరిగే బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని భట్టి విక్రమార్క తెలిపారు.