దారుణం - ఆస్తీ కోసం త‌ల్లి అంత్య‌క్రియ‌లు ఆపారు

దారుణం - ఆస్తీ కోసం త‌ల్లి అంత్య‌క్రియ‌లు ఆపారు

ముద్ర,తెలంగాణ:- సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని ఆస్తి కోసం కొడుకు, కూతుళ్లు గొడవ పడ్డారు. వివాదం కొలిక్కిరాకపోవడంతో.. కనీసం అంత్యక్రియలు కూడా నిర్వహించకుండా రెండు రోజులుగా ఆమె భౌతికకాయన్ని ఇంట్లోనే ఉంచడం అందరిని షాక్‌కు గురిచేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వెము లక్ష్మమ్మ (80) అనే వృద్ధురాలు అనారోగ్యం బారినపడి బుధవారం రాత్రి మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే లక్ష్మమ్మ వద్ద రూ.21 లక్షల విలువైన ఆస్తి, 20 తులాల బంగారం ఉన్నాయి. 

ఇదివరకే ఒక కొడుకు మరణించాడు. తాజాగా తల్లి మరణవార్త తెలుసుకున్న మరో కొడుకు, కోడలు, కూతుళ్లు కందులవారి గూడెం చేరుకున్నారు. అంత్యక్రియలు చేయకుండా ముందుగా ఆస్తి కోసం గొడవ పడ్డారు. చివరికి గ్రామ పెద్దల వద్ద పంచాయితీ పెట్టుకున్నారు. రెండు రోజులుగా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. ఇంకా కొలిక్కి రాకపోవడంతో.. అంత్యక్రియలు చేయకుండా తల్లి భౌతిక కాయాన్ని ఇంట్లోనే ఉంచేశారు. కన్నబిడ్డలే అంత్యక్రియలు చేయకుండా ఆస్తి కోసం గొడవపడటాన్ని చూసి స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.