కోర్కెలు తీర్చే కమనీయమూర్తి కనకమామిడి వెంకన్న

కోర్కెలు తీర్చే కమనీయమూర్తి కనకమామిడి వెంకన్న
  • 21 వ తేదీనుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నవమ  బ్రహ్మోత్సవాలు
  • బ్రహ్మోత్సవానికి సర్వాంగసుందరంగా ముస్తాబవుతున్న  వెంకన్న ఆలయం 

హైదరాబాద్, ముద్ర ప్రతినిధి.  కలియుగదైవంగా భక్తులు ఆరాధించే శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఆలయం ఎక్కడ ఉన్నా.. అక్కడి భక్తులకు సుఖసౌఖ్యాలు చేకూరుతుంటాయి.  అలాగే వేంకటేశ్వరుడు భక్తుల కోర్కెలు తీర్చడమేకాదు, అప్పుడప్పుడూ భక్తుల సహనానికి, విచక్షణా జ్ఞానానికి, మనో నిబ్బరానికి పరీక్షలు కూడా పెడుతుంటాడని అనుభవైక భక్తకోటి చెపుతుంటారు. ఈ వాస్తవం స్వామివారిని ప్రత్యక్షదైవంగా చిత్తశుద్ధితో ఆరాధించేవారికి మాత్రమే అనుభవంలోకి వస్తుంది.  అలాంటి మహిమాన్విత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో రంగారెడ్డిజిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో  వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందింది. వందల సంవత్సరాల క్రితం నిజాం నవాబులను సైతం తన భక్తులుగా చేసుకొని భక్తకోటికి తన దివ్యస్వరూపంతో సుఖసౌభాగ్యాలను అనుగ్రహిస్తూ  కనకమామిడి వెంకన్నగా విశేష పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈ వేంకటేశ్వరుడు డిసెంబర్ 21వ తేదీనుంచి నవమ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోనున్నాడు.

 బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు 

డిసెంబర్ 21వ తేదీ శుద్ధ నవమి గురువారంనాడు ఉదయం 4 గంటలకు సుప్రభాతంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుభారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, 9 గంటలకు రక్షాబంధనం, ధ్వజారోహణం, దేవతాహ్వానం, 10 గంటలకు భక్తులచే సామూహికంగా  ధన్వంతరి సహిత సుదర్శన హవనం కార్యక్రమాలు జరుగుతాయి. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం, 2 గంటలకు కనకమామిడి గ్రామ మహిళలచే విష్ణుసహస్రనామ పారాయణం,   సాయంత్రం 5 గంటలకు స్వామివారి పల్లకీసేవ, ఊరేగింపు కార్యక్రమాల్లో మహిళలు కోలాట ప్రదర్శనతో భక్తులను అలరిస్తారు. ఇక రాత్రి 8 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

22వ తేదీ శుద్ధ దశమి, శుక్రవారంనాడు ఉదయం 4 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 10 గంటలకు తిరుకల్యాణం, మధ్యాహ్నం 12 గంటలకు ఆధ్యాత్మిక ప్రసంగ కార్యక్రమం, ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం జరుగుతాయి. ఇక సాయంత్రం 4 గంటలకు పుష్పార్చన, పుష్పయాగం అనంతరం రాత్రి 8 గంటలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం, 10 గంటలకు భక్తులచే భజన కార్యక్రమం జరుగుతాయి. నేటి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చిట్ల పార్థసారథి ముఖ్యఅతిధిగా పాల్గొంటారు.

23వ తేదీ శుద్ధ వైకుంఠ ఏకాదశి, శనివారంనాడు తెల్లవారుజామున 2 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం (ఉత్తర ద్వార దర్శనం), 10 గంటలకు ఆధ్యాత్మిక ప్రముఖులచే భగవద్గీతా పారాయణం, విష్ణుసహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో చిడతల కళాకారులచే రామాయణ ప్రదర్శన, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటలకు ధ్వజారోహణం, దేవతోద్వోసనతో శ్రీవెంకటేశ్వరస్వామివారి నవమ బ్రహ్మోత్సవాలకు స్వస్తి పలుకుతారు.

 ముమ్మరంగా ఏర్పాట్లు 

బ్రహ్మోత్సవాల కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు కొండా  లక్ష్మీకాంతరెడ్డి (9959656464), కార్యదర్శులు కె. బల్వంత్ రెడ్డి (9912066204), ఎం. శ్రీనివాసరెడ్డి (9704673459), ఆలయ ప్రధాన అర్చకులు యోగా నరసింహాచార్యులు (8639198896), అర్చకులు నరేంద్రాచార్యులు (9666881681) బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్సవాల్లో పాల్గొనదలచిన భక్తులు వారిని సంప్రదించవచ్చు.

 శనివారం.. శ్రీనివాసుని ప్రియవారం.. 

1. ఓంకారం ప్రభవించినరోజు శనివారం.
2. శనివారం రోజున ఎవరైతే శ్రీనివాసునికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తారో వారిని తాను పీడించబోనని సాక్షాత్తూ ఆ శనీశ్వరుడే శ్రీనివాసునికి వాగ్దానం చేసిన రోజు.. శనివారం.
3. శ్రీనివాసుడు మహాలక్ష్మిని తన వక్షస్థలమున నిలిపిన రోజు.. శనివారం.
4. శ్రీనివాసుని భక్తులు మొట్టమొదట దర్శించుకున్న రోజు.. శనివారం.
5.సప్తగిరులపై తన ఆలయాన్ని నిర్మించమంటూ సాక్షాత్తూ శ్రీ వెంకటేశ్వరుడు ప్రత్యక్షమై తొండమాన్ చక్రవర్తికి ఆజ్ఞ ఇచ్చిన రోజు.. శనివారం.
6. శ్రీనివాసుని ఆయుధాల్లో ఒకటైన సుదర్శనం పుట్టినరోజు.. శనివారం.
7. సప్తగిరులపై నిర్మించిన తన ఆలయంలో శ్రీనివాసుడు ప్రవేశించిన రోజు.. శనివారం.
8. శ్రీనివాసుడు పద్మావతీదేవిని వివాహమాడిన రోజు.. శనివారం.