మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం 

మున్సిపల్ కార్మికుల సమ్మె ప్రారంభం 
  • నిలిచిన పారిశుద్ధ్య పనులు 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ మున్సిపల్ కార్మికులు తమ సమస్యల సాధన కోసం బుధవారం మెరుపు సమ్మె ను ప్రారంభించారు. తమ సమస్యల సాధన కోసం వారు సమ్మె చేపట్టడంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిలిచి పోయాయి. నిర్మల్ మున్సిపాలిటీ లో దాదాపు 350 కి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరిలో కొందరికి రెండు మాసాల నుండి నాలుగు మాసాల వరకు వేతనాలు రావాల్సి ఉంది. పే రివిజన్ బకాయిలు కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పి ఎఫ్, ఈ ఎస్ ఐ  నిధులు కూడా సకాలంలో చెల్లింపులు జరపని కారణంగా సమ్మెకు దిగుతున్నట్లు పారిశుద్ధ్య కార్మికులు స్పష్టం చేశారు. తాము కష్టపడి పని చేస్తున్న కారణంగానే పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని, అయితే తమ కష్టాన్ని అధికారులు గుర్తించని కారణంగానే సమ్మెకు దిగాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. 

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఎంఎల్ఏ మహేశ్వర్ రెడ్డి

మున్సిపల్ కార్మికుల సమ్మె శిబిరాన్ని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు. కార్మికులతో పని చేయించుకుని వారికి వేతనాలు ఇవ్వకుండా వేధించటం  పద్ధతి కాదన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో మాట్లాడతానని అన్నారు. తాత్కాలిక కార్మికులను రెగ్యులర్ చేయటం ప్రభుత్వ నిర్ణయం కనుక ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు.