ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎన్టీఆర్ అభిమానులు

ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన ఎన్టీఆర్ అభిమానులు

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్దంతి సందర్భంగా ఎన్టీఆర్ అభిమాన సంఘం సూర్యాపేట ఆధ్వర్యంలో స్ధానిక నల్లాబావి సెంటర్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మాజి మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ 1982 మార్చి 29 వ తేదిన తెలుగుదేశం పార్టీని స్ధాపించి కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాలలోకి రాకముందు 30 సంవత్సరాల పాటు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని కథానాయకుడుగా వెలుగొందారని ఆయన అన్నారు. రాముడు, క్ర్రష్ణుడు, వెంకటేశ్వర స్వామిగా ఎన్టీఆర్ పౌరణిక పాత్రలలో జీవించారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్  పేద ప్రజల సంక్షేమం కోసం రెండు రూపాయలకు కిలో బియ్యం, ఇండ్ల నిర్మాణం, పాఠశాలలో మధ్యాహ్న భోజనం పధకం, రేషన్ కార్డులు, వంటి అనేక సంక్షేమ పధకాలు అమలు చేశారని ఆయన అన్నారు. మండలాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారని అన్నారు. బడుగు బలహీన వర్గాల నాయకులకు పార్టీలో పదవులు ఇచ్చారని, స్ధానిక సంస్థలలో  బిసి లకు 20% రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. ఎన్టీఆర్ అభిమానులందరూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎన్టీఆర్ అభిమానులందరూ కాంగ్రెస్  పార్టీకి మద్దతు ఇచ్చారని ఆయన అన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రములో 16 ఎంపి స్థానాలలో విజయం సాధిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కౌన్సిలర్ షఫివుల్లా, గోదాల రంగా రెడ్డి, జానకిరాములు, నేరెళ్ళ మధు, గోపగాని గిరి, కొండగడప సూరయ్య, సలిగంటి శ్రీనివాస్, మునిర్ ఖాన్, దాసరి వెంకన్న, గోవిందాచారి, రామాచారి, రాజేష్, డాక్టర్ హరి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.