పొత్తులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!

పొత్తులపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
Nagababu sensational comments

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. మరోమారు అధికారంలోకి రావాలని.. 175కి 175 సీట్లు సాధించాలని వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇంకోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే శాసనసభలో అడుగుపెడతానంటూ భీషణ ప్రతిజ్ఞ చేశారు. ఇక జనసేనాని పవన్‌ కల్యాణ్‌ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ?జనసేన కలసి పోటీ చేస్తాయనే చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల విజయవాడలో పవన్‌ కల్యాణ్‌ ను చంద్రబాబు హైదరాబాద్‌ లో చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కలవడంతో పొత్తులపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన సభలో పవన్‌ మాట్లాడుతూ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన ముఖ్య నేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జనసేన వీర మహిళలు కార్యకర్తల సమావేశానికి హాజరైన నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

మరోసారి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ ఒక పార్టీయేనా.. అరాచకం దుర్మార్గం దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అనేది పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటిస్తారని నాగబాబు తెలిపారు. పొత్తులు ఖరారు తరువాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలో తెలుస్తుందని వివరించారు. వీరమహిళలు జన సైనికులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు వచ్చానని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి జన సైనికులు బలంగా వున్నారన్న నాగబాబు.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇంఛార్జీలను నియమించాలని సూచించారు.

తద్వారా పవన్‌ పొత్తులపై స్పష్టంగానే ఉన్నారని త్వరలో ఈ మేరకు ప్రకటన కూడా చేయబోతున్నట్లు నాగబాబు మాటల ద్వారా స్పష్టమవుతుందని అంటున్నారు. ఆ తర్వాత ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేదాని పైన క్లారిటీ వస్తుందంటున్నారు. మరోవైపు టీడీపీ? జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తే మరి బీజేపీ సంగతి ఏంటనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. ప్రస్తుతం జనసేన? బీజేపీల మధ్య పొత్తు ఉంది. బీజేపీ తమ కూటమిలో చేరితే సరి లేకుంటే జనసేన? టీడీపీ కలిసి సాగాలనేది పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయమని టాక్‌ నడుస్తోంది.