కల్వకుంట్ల కుటుంబం కోసమే బిఆర్ఎస్

కల్వకుంట్ల కుటుంబం కోసమే బిఆర్ఎస్
  • బిజెపి ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:తెలంగాణా కోసం పుట్టిన టి ఆర్ ఎస్ కల్వకుంట్ల కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని బిజెపి ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె లక్ష్మణ్ విమర్శించారు. విజయ సంకల్ప యాత్ర లో భాగంగా మంగళవారం రాత్రి 9.30 గంటలకు నిర్మల్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రసంగించారు.నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారని అన్నారు. బీ ఆర్ ఎస్ కల్వకుంట్ల కుటుంబ అభ్యున్నతి కోసం కృషి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నెహ్రూ, ఇందిరమ్మ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసమే పని చేస్తోందని విమర్శించారు. నరేంద్ర మోడీ ఈ దేశమే తన కుటుంబమని భావిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు. గత 23 ఏళ్ల నుండి ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా పనిచేస్తున్న మచ్చలేని నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. విరమణ లేకుండా నిరంతరం పనిచేస్తున్న వ్యక్తి అని, తల్లి చనిపోతే అంతిమ సంస్కారాలు పూర్తిచేసి తిరిగి విధుల్లో చేరారన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవినీతి కుంభకోణాల పార్టీలేనన్నారు. కులం పేరిట, మతం పేరిట ఓట్లు దండుకునే పార్టీలని, ఎంఐఎం పార్టీని పెంచి పోషించేది టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలేనని ఆరోపించారు. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సేవలు నిర్మల్ కే కాకుండా రాష్ట్రానికి అవసరమని బిజెపి శాసనసభ పక్ష నేతగా నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎంపి సోయం బాపురావు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బిజెపి నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అంజు కుమార్ రెడ్డి, అయ్యన్న గారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.