రాహుల్ అనర్హత పై దేశ వ్యాప్త ఉద్యమం భట్టి విక్రమార్క

రాహుల్ అనర్హత పై దేశ వ్యాప్త ఉద్యమం  భట్టి విక్రమార్క

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: రాహుల్ గాంధీ ని పార్లమెంట్ సభ్యుడిగా కేంద్రం అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఏఐసీసీ దేశ వ్యాప్త ఆందోళన కు ప్రణాళిక రూపొందిస్తోందని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐసీసీ సూచనల ప్రకారం తెలంగాణ లో నిరసన ఉద్యమాలు చేపడుతామని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం వల్ల దేశంలోని విపక్షాలు, ప్రజాస్వామికవాదులు కేంద్రం చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారని ఆయన తెలిపారు.

1975లో ఇందిరాగాంధీ ని ఆరేళ్ళు అనర్హత వేటు వేస్తే ఆ తర్వాత పోటీ చేసిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన గతాన్ని గుర్తు చేశారు. రాహుల్ కు కూడా ప్రజలు అక్కున చేర్చుకుని బ్రహ్మరథం పడతారని ఆయన అన్నారు. దేశాన్ని దోచుకున్న బడా వ్యాపారులు విదేశాలకు దర్జాగా పారిపోతే అడ్డుకుని అరెస్టు చేయలేని కేంద్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరిన రాహుల్ ను అనర్హుడిగా ప్రకటించడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రమాదంలో కూరుకుపోయిన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రజాక్షేత్రంలో దిగి స్వరం వినిపించడం రాహుల్ చేసిన తప్పిదామా అని ఆయన ప్రశ్నించారు.