మహేశ్వర్ రెడ్డి ఆమరణ దీక్ష భగ్నం

  • ఆసుపత్రికి తరలింపు
  • దీక్ష సాగిస్తానన్న ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్:నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలన్న డిమాండ్ తో గత ఐదు రోజులుగా మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను ఆరో రోజు తెల్లవారు జామున నిర్మల్ పోలీసులు భగ్నం చేశారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో దీక్షను భగ్నం చేసి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డి ఎస్ పి గంగారెడ్డి నేతృత్వంలో పోలీసులు తెల్లవారు జామున 2.50 గంటల ప్రాంతంలో మహేశ్వర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులను ఇంట్లోకి ప్రవేశించనీయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. చివరికి బలవంతంగా లోపలికి ప్రవేశించారు. దీక్ష కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి అంటున్నా వినకుండా ఆయనను పోలీసులు అంబులెన్స్ వాహనంలోకి తరలించారు. జిల్లా ప్రధానాసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • దీక్ష కొనసాగిస్తున్నా : ఏలేటి

ఇదిలా ఉండగా తనను బలవంతంగా ఆసుపత్రికి తరలించినప్పటికి అక్కడే దీక్ష కొనసాగిస్తానని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి చీఫ్ కిషన్ రెడ్డి, కేంద్ర పెద్దలు సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ నిర్మల్ కు సోమవారం రానున్న నేపథ్యంలో వారి సూచన మేరకు నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.