ఉద్యోగుల సమస్యలపై  చర్చలతో ఉపయోగం లేదు

ఉద్యోగుల సమస్యలపై  చర్చలతో ఉపయోగం లేదు

విజయవాడ: ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంతో జరిపిన చర్చల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. మంత్రుల బృందంతో మాటలు.. చాయ్‌ బిస్కెట్‌ చర్చలే తప్ప ఎలాంటి ఫలితం లేదన్నారు. నగరంలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై చర్చించారు. ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు.  ''ఫిబ్రవరి 13న ఏపీజేఏసీ అమరావతి నుంచి సీఎస్‌కు 50 పేజీల వినతిపత్రం ఇచ్చాం. అయినా ఎలాంటి స్పందన లేదు.

ఉద్యోగులు చట్టబద్ధంగా దాచుకున్న డబ్బును రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంది. న్యాయబద్ధంగా రావాల్సిన జీతభత్యాలు సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వం ఉద్యోగులను చులకనగా భావిస్తోంది. ఉద్యోగులు ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తుంటే దాన్ని చేతగానితనంగా చూస్తోంది. చలో విజయవాడ జరిపి ఏడాది గడిచినా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదు. మంత్రుల బృందంతో జరిపిన చర్చలన్నీ చాయ్‌ బిస్కెట్‌ చర్చలుగా మిగిలాయి. నెలలో 20వ తేదీ వరకు ఉద్యోగులకు జీతాలు ఇస్తూనే ఉన్నారు. జీతాలు రాకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కిరాణా కొట్టు వారు కూడా ఉద్యోగులను చులకన భావంతో చూస్తున్నారు. మా ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాలు సహకరించాలని, ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని కోరుతున్నాం'' అని బొప్పరాజు వివరించారు.