మద్యం పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు ...ఈ నెల 19న నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్...!
ఈ నెల 18న రాష్ట్ర క్యాబినెట్లో కొత్త మద్యం పాలసీపై చర్చించి 19న నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 1 నుంచి పాలసీని అమలు చేయాలని యోచిస్తోంది. ఆన్లైన్ లాటరీ ద్వారా షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పరిధిలో షాపులు ఉండగా, ఇకపై ప్రైవేటు వ్యక్తులకే అప్పగించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని CM, మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏయే ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రిఫండబుల్ ఛార్జీలు, లైసెన్సు రుసుములు ఎలా ఉండాలి? తదితర అంశాలపైన అధికారులు సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఎక్సైజ్ కార్యాలయంలో కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్‌లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యం విధానాన్నే తీసుకురావాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ నెల 18న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది.