శ్రీమహావిష్ణుగా దర్శనమిచ్చిన నృసింహుడు..

శ్రీమహావిష్ణుగా దర్శనమిచ్చిన నృసింహుడు..
  • గరుడ వాహనశేవలో ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగిన స్వామివారు.

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు శ్రీమహావిష్ణుగా భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవములలో మంగళవారం ఉదయం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం ఉదయం శ్రీ స్వామి వారిని శ్రీమహావిష్ణు అలంకారం గావించి గరుడ వాహనశేవలో అలంకరించి ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, వేదపండితులు, పారాయణీకులు అత్యంత వైభవముగా ఆలయ తిరుమాఢ వీధులలో ఊరేగించారు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త  బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ. భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి,  సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు. 

శ్రీమహావిష్ణు అలంకారము (గరుడ వాహన శేవ) ప్రత్యేకత

విష్ణు అను శబ్దమునకు సర్వవ్యాపకుడని అర్ధం. పాలకడలిలో శ్రీ లక్ష్మీ విశిష్ఠుడై శ్రీమహావిష్ణువు చతుర్భుజములతో శంఖ, చక్రాది ఆయుధములతో సనక, సనందాది యోగులను కటాక్షించుచూ సమస్త లోకములను అనుగ్రహించుచూ లోకకంఠకులైన దానవులను సంహరించుటకు మహావిష్ణువు యొక్క అంశతో మత్స్యాది అవతారములు అవతరించుచూ భక్తులను రక్షించును. అవతారములన్నింటికి మూలమైన శ్రీమహావిష్ణువు రూపములో శ్రీ నరసింహ స్వామి వారిని అలంకరించి గరుడవాహనారూఢుడుని గావించి తిరువీధులలో భక్తుల దర్శనార్ధం ఈ వేడుక నిర్వహిస్తారు. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో గరుడుడుని పెరియతిరువడి అని సంభోదిస్తారు. గరుడుడు భగవానునికి దాసుడిగా, సఖుడుగా, వాహనంగా, ఆసనముగా, ధ్వజముగా, గొడుగుగా వివిధ రూపములలో అనేక కైంకర్యములు నిర్వహిస్తారు. వేదవేద్యుడైన భగవానుడు వేదస్వరూపుడైన గరుడుడిని అధిరోహించి భక్తులకు దర్శనము కలిగించుట ఎంతో విశేషమై యున్నది.

సాయంకాల కార్యక్రమములు

మంగళవారం సాయంకాలం శ్రీ స్వామి వారి ఆలయంలో నిత్యఆరాధనల అనంతరం చతుస్ధానార్చలు, మండపరాధనలు, మూలమంత్రజపములు, ద్వారతోరణ పూజలు, దివ్య ప్రబంధపారాయణాదులు, మహామంత్ర పుష్పపఠనములు, పురాణ ఇతిహాస విజ్ఞాపనలు నిర్వహించారు. అనంతరం దివ్యవిమాన రధోత్సవ వేడుకలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహించబడును. రధాంగహోమము, రధబలి నిర్వహించెదరు. శ్రీ స్వామి వారి ఉత్సవమూర్తుల అలంకారశేవ రధముపై వేంచేపు చేసి భక్తుల దర్శనార్ధము ఆలయ మాఢవీధులలో అంగరంగ వైభవముగా ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, వేదపండితులు, పారాయణీకులు రధోత్సవ వేడుక నిర్వహించెదరు. ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎ. భాస్కర్ రావు, ఉప కార్యనిర్వహణాధికారి, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

శ్రీ స్వామి వారి దివ్యవిమాన రధోత్సవ వేడుక ప్రత్యేకత

భగవానుడు సగుణసాకార రూపుడై ఉత్సవమూర్తిగా ఆరాధనలు అందుకొనుచు ఒకచోట నుండి మరొక చోటుకు వెళ్ళడానికి ఒక సాధనముగా ఒక వాహనమును స్వీకరించుట వేదప్రసిద్ధి కలిగి ఉన్నది. వాటన్నింటిలో అత్యుత్తమమైనది రధరూపయానము. స్థిరముగా, సుఖముగా కూర్చోవడానికి అనుకూలమైనది రధము అని రధశబ్ద అర్ధం.

ఛందోమయ, దేవమయ, వాహనమయ, దారుమయ అని నాలుగు విధములుగా భగవానుడి దివ్యరధములు కలవని మహాభారతము తెలియజేయుచున్నది. రధం శరీరం పురుషస్య అంటూ ఈ దేహము ఒక రధమని, ఇంద్రియములు అశ్వములని, వాటి పగ్గాలను బిగబట్టి దేహమనే రధాన్ని సుఖమైన మార్గంలో నడిపే వాడుగా జీవుడిని భగవానుడు రక్షిస్తాడని ఈ వేడుకలోని అంతరార్ధం.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవమూర్తులను ఊరేగింపు వేడుకగా రధారూఢులను గావించి భక్తుల ఆనందోత్సాహాల మధ్య భజన కోలాటాల, నృత్యముల, మేళవాయిద్యములతో ఈ వేడుక నిర్వహించారు. ఎంతచూసినా తనివితీరని వేడుక ఈ రధోత్సవ వేడుక. ఈ అపూర్వమైన వేడుక జయహోనరసింహ జయజయ నరసింహ అంటూ ఈ వేడుక దివ్యవిమాన రధోత్సవముగా నిర్వహింపబడుట మహత్తరమైన సౌభాగ్య ప్రదాయకమైన వేడుకగా ప్రసిద్ధినొందినది.

సాంస్కృతిక కార్యక్రమములు

మంగళవారం ఉదయం శబరిగిరీశ అయ్యప్ప భక్త బృందం, శివరామకృష్ణ భజన మండలి, భాగ్యలక్ష్మి మహిళా భజన మండలి వారు చేసిన భజన కార్యక్రమాలు భక్తులను అలరించాయి. అనంతరం  వెంపరాల వేంకట లక్ష్మీశ్రీనివాస మూర్తి శ్రీమత్ భాగవతాంర్గత నృసింహాతత్త్వం అను ఉపన్యాసం, శారద భాగవతారిణి ధృవచరిత్ర అను హరికధాగానం నిర్వహించారు.

సాయంకాలం

శ్రీ శారద సంగీత విద్యాలయం వారిచే భక్తి సంగీత కార్యక్రమం, డాక్టర్ డి.వి.మోహనకృష్ణ  కర్ణాటక సంగీత కార్యక్రమం అలరించాయి.  కుమారి వైష్ణవిగోపాల్ చే వీణావాద్యం, విశ్వజ, విష్ణుజ, సమతుల్య యోగా కూచిపూడి డాన్స్, ఆర్.వి.యస్.ఎన్.వి.సోమయాజులు, వేదాంతం కూచిపూడి డాన్స్ అకాడమి, భరద్వాజ నాట్యాలయం, డ నవ్య నాగబండి, నాట్యమయూరి డాన్స్ అకాడమి వారలచే కూచిపూడి నృత్య కార్యక్రమం,  గడ్డం సుదర్శన్ చిందుయక్షగాన కార్యక్రమం నిర్వహించారు. శాపెల్లికి చెందిన శ్రీ లక్ష్మీనృసింహ స్వామి చెక్కభజన మండలి వారిచే చెక్కభజన, శ్రీ లక్ష్మీశ్రీనివాస కోలాట భజన మండలి, హైద్రాబాద్, సాంస్కృతిక విశ్వకళా మండలి, రాంపల్లి వారిచే కోలాట కార్యక్రమం స్వామి వారి రధం ముందు నిర్వహించారు.