అభివృద్ధిని చూసి ఓటేయ్యాలి: సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ ను ఓడగొట్టుకుంటే గోస పడతారు
తెలంగాణ ప్రజల బాగు కోసం పుట్టింది బీఆర్ఎస్
కాంగ్రెస్ కు ఓటేస్తే కరెంటు కాట కలుస్తది
చెప్పుడు మాటలు విని ఓటేయ్యొద్దు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ కు వెయ్యాలి
ఓటు మీ తలరాత మారుస్తుంది, అది మీ చేతుల్లో ఉంది
50 ఏండ్ల పాలనలో జనం గోస పడ్డారు
నల్గొండ, నకిరేకల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
ముద్ర ప్రతినిధి, నల్గొండ: అభివృద్ధిని చూసి ఓటేయ్యాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నల్గొండ, నకిరేకల్ నియెజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తమని 2004లో టీఆర్ఎస్ పార్టీతోటి పొత్తు పెట్టుకున్నదని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నకిరేకల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం కావద్దని, ఎవరో చెప్పిన మాటలు పట్టుకుని ఓట్లు వేయవద్దని, ఆచితూచి, బాగా ఆలోచించి ఓట్లు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ జిల్లా మహనీయులు పుట్టిన జిల్లా అని కొనియాడారు. ఈ జిల్లా మహనీయులు పుట్టిన జిల్లా అని కొనియాడారు. ఉద్యమాలు చేసిన గడ్డ. బాగా చైతన్యం ఉండే ప్రాంతమని నా విశ్వాసం. ఎన్నికలు వస్తుంటయ్.. పోతుంటయ్. ఎన్నికలు రాగానే గడబిడ గావద్దు. ఎవరో చెప్పింది నమ్మి ఓటేయొద్దు. బాగా ఆలోచించి ఓటేయాలె. అందుకు కావాల్సిన ప్రజాస్వామ్య పరణతి మనలో రావాలె. మీరు ఆషామాషీగా ఓటేస్తే గెలువాల్సిన వాళ్లు కాకుండా ఇతరులు గెలుస్తరు.
అప్పుడు వాళ్ల పాలన బాగున్నా లేకున్నా ఐదేండ్లు భరించాలె. కాబట్టి ఓటేసేటప్పుడు అభ్యర్థుల గుణగణాలను చూడాలె. ఆ అభ్యర్థుల వెనుక ఉన్న పార్టీల చరిత్రను పరిశీలించాలె. ఏ పార్టీ చరిత్ర ఏంది..? తెలుసుకుని ఓటేయాలి’ అని సీఎం చెప్పారు. ‘బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది. తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల బాగుకోసం పుట్టింది. 15 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఉన్న తెలంగాణను ఊడగొట్టింది. పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఇస్తమని 2004ల టీఆర్‌ఎస్‌తోటి పొత్తుపెట్టుకుంది. ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పింది. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని గట్టిగ కొట్లాడినంక ఆఖరికి దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కానీ బీఆర్‌ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యం ఇచ్చినం. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టినం. ఇవన్నీ మీకు తెలిసినవే’ అని సీఎం అన్నారు. ‘రైతుల సంక్షేమం కోసం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నది. మీ దగ్గర మూసీ ప్రాజెక్టు ఉంది. గతంలో నీటి తీరువాను వసూలు చేసేటోళ్లు. మేం దాన్ని రద్దు చేసినం. 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నం. రైతుబంధు ఇస్తున్నం. అదృష్టం బాగాలేక రైతు చనిపోతే రైతుబీమా ఇస్తున్నం. 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీరు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటున్నది. ఇవన్నీ మీ కళ్లముందు జరుగుతున్నయే. కానీ కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో కనీసం మంచి నీళ్లు కూడా ఇయ్యలే’ అని సీఎం విమర్శించారు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. ఎవ్వళ్లు ఏం చేసిండ్రు. ఎవరి చేతిలో అధికారం ఉంటే ఏం చేస్తరు. ఎవ్వళ్లు ప్రజల కోసం పాటు పడుతారు అనేది ఆలోచించి మీరు ఓటేసినట్టే అయితే మీకు లాభం జరుగుతది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నర్రా రాఘవరెడ్డి ఎండిపోయిన వరి కంకులు చూపిస్తుండే. కరెంట్ కోసం రోజు కొట్లాడుతుండే. విజయవాడ రోడ్డు అప్పుడప్పుడు బంద్ చేపిస్తుండే. అప్పుడుప్పుడు అసెంబ్లీలో కంకులు తెచ్చి చూపిస్తుండే. అటువంటి మహానాయకుడు ఈ గడ్డ మీద పుట్టారు. కమ్యూనిస్టు సోదరులకు మనవి చేస్తున్నా. ఇక్కడ మీరు పోటీలో లేరు. మీ ఓట్లు ఎవరికో వేసి మోరిలో పడేయకండి. ఒక ప్రగతికాముకమైన బీఆర్ఎస్ పార్టీకి దయచేసి వేయండి. లింగయ్యకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నా అని కేసీఆర్ కోరారు. ప్రజల్లో ఉండే మనిషి... వారి వ్యక్తిగత పనులు ఏ రోజు అడగలేదు. కాల్వలు, అయిటిపాముల ఎత్తిపోతల, బ్రాహ్మణ వెల్లెంల, హాస్పిటళ్ల గురించి అడిగిండు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, బ్రహ్మాండంగా గెలిపించండి. లింగయ్య గెలుపును ఎవడు ఆపలేడు. ప్రజా శక్తి ముందు వ్యక్తులు ఎవరేం చేయలేరు. కాయలు ఉన్న చెట్టు మీదనే రాళ్లు పడుతాయి. రందీ పడాల్సిన అవసరం లేదు.
ఇంత ప్రజా శక్తి నీ వెంట ఉన్నది.. తప్పకుండా విజయం నీదే.. అందులో అనుమానమే లేదు. లింగయ్యను గెలిపించండి.. ఇది వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను అని కేసీఆర్ హామీ ఇచ్చారు. నల్లగొండ ఎట్లా ప్రజలు చూస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్ల పాలనలో జనం గోస అనుభవించిండ్రని గుర్తుచేశారు. చెప్పుడు మాటలు విని ఎవరికి పడితే వాళ్లకు ఓటేయొద్దని కోరారు. ఎవరు గెలిస్తే మంచి జరుగుతదో.. ఎవరు గెలిస్తే ఆగమైతమో ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. అభ్యర్థుల గుణగణాలను, పార్టీల చరిత్రను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. ‘మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క హక్కు ఓటు. అది దుర్వినియోగం అయితే మీ భవిష్యత్తు అంధకారమైతది. కాబట్టి ఓటేసేటప్పుడు బాగా ఆలోచించి ఓటేయాలని నేను కోరుతున్న. ఎవరికి ఓటేయాలనే దానిపై గ్రామాలల్ల చర్చపెట్టి రాయేదో.. రత్నమేదో గుర్తించాలె. అభ్యర్థులు ఎలాంటోళ్లు, వాళ్ల వెనుకున్న పార్టీలు ఎలాంటివి..? అనే అంశాలపై కూడా చర్చ చేసి ఓట్లేయాలె. నేనొస్తుంటే చాలా సంతోషం అనిపిచ్చింది. మళ్ల యాసింగి పంటలకు పొలాలన్ని తడిపి నీళ్లతోని కనపడుతున్నయ్. అంతకుముందు నల్లగొండలో తిరిగితే లక్షల ఎకరాల్లో ఆముదం పంట కనిపించేది. ఇప్పుడు బ్రహ్మాండంగా వరి పంటలు పండుతున్నయ్ అని సీఎం తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిన పార్టీ. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని, అంతకుముందు కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని మీరు బేరీజు వేసుకోవాలె. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఏదీ సక్కగ లేకుండె. మంచి నీళ్లు లేవు. సాగు నీళ్లు లేవు. కరెంటు లేదు. భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు.
రైతుల ఆకలి చావులు. నల్లగొండ జిల్లా బిడ్డలంతా హైదరాబాద్‌కు పోయి కూలీనాలీ చేసుకుని బతుకుడు. ఇది కాంగ్రెస్ 50 ఏండ్ల చరిత్ర. పొరపాటున మళ్ల కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తే అయ్యే పాత రోజులు వస్తయ్’ అని సీఎం హెచ్చరించారు. కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన వారికి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు. ఓటు మీ తల రాత రాస్తది. మీ భవిష్యత్‌ను నిర్ణయిస్తది. పనికిమాలిన వారికి వేస్తే మనకు పనికిమాలిన ప్రభుత్వమే వస్తది. ఎందుకంటే ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రంలో ఆ ప్రభుత్వం ఏర్పడుతది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే మంచిగా ఉంటది. మరి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే దీని భవిష్యత్ బాగుంటది. ఎవరు ఉంటే పేదల సంక్షేమం చూస్తరు. ఎవరు ఉంటే రైతుల గురించి తండ్లాడుతారు. మీరు ఆలోచించాలని మనవి చేస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజ్యంలో అప్పులు ఉంటే, పన్నులు కట్టకపోతే దర్వాజాలు పీక్కపోయారు కానీ రైతుబంధు ఇవ్వాలని ఎవ్వడన్న ఆలోచన చేశారా..? ఆదుకున్నారా..? రైతుబంధు పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మరి రైతుబంధు కూడా ఆగమైతది. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే.. నేను ఇవాళ గ్యారెంటీగా చెబుతున్నా. తర్వాత నన్ను తప్పుపట్టుకోవద్దు. కరెంట్ కాట కలుస్తది గ్యారెంటీగా, ఎందుకంటే వారు చెబుతున్నారు. ఓడగొట్టుకుంటే మీదే తప్పు. మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెబుతున్నారు. కర్ణాటకలో 20 గంటలని చెప్పి 5 గంటలు ఇస్తున్నారు. మరి ఐదు గంటల కరెంట్ కావాల్నా..? 24 గంటల కరెంట్ కావాల్నా..? మంచి క్వాలిటీ కరెంట్ కావాల్నా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. నల్గొండ, నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్ధి లింగయ్య లను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.