కల సాకారం

కల సాకారం

పాలమూరు రంగారెడ్డి పైలాన్ ఆవిష్కరించిన కేసీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :  దశాబ్దాల కల నెరవేరింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రతిష్టాత్మక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ వద్ద పాలమూరు- రంగారెడ్డి పైలాన్ ను ప్రారంభించిన కేసీఆర్ అక్కడి పంపుహౌస్ స్వీచ్  ఆన్​ చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ఈ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టారు.

అంతకుముందు అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి పట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మ‌ల్లారెడ్డి, ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, స‌బితా ఇంద్రారెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హ‌ర్షవ‌ర్ధన్ రెడ్డితో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతికుమారి, డీజీపీ అంజ‌నీ కుమార్‌, స్మితా స‌బ‌ర్వాల్‌తో పాటు ఇరిగేష‌న్, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.


12.30 లక్షల ఎకరాలకు సాగునీరు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతోపాటు రంగారెడ్డి జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకాని (పీఆర్‌ఎల్‌ఐఎస్‌)కి రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో 2015లో తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో తాగునీరు, రెండో దశలో సాగునీటికి సంబంధించిన పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. అందులో భాగంగా ఇప్పటికే మొదటి దశలో చేపట్టిన తాగునీటి సరఫరాకు సంబంధించిన పనులను నాగర్‌కర్నూల్‌ జిల్లా శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి మొత్తంగా 21 ప్యాకేజీలుగా విభజించగా,  కేపీ లక్ష్మీదేవిపల్లి మినహా ప్రస్తుతం 18 ప్యాకేజీల పనులను మాత్రమే ప్రభుత్వం చేపట్టింది. ప్రస్తుతం ఆయా ప్యాకేజీల పనులన్నీ దాదాపు తుదిదశకు చేరుకున్నాయి. ఇక ప్రాజెక్టు ద్వారా నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నారాయణపేట, మక్తల్‌, దేవరకద్ర, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, పరిగి, వికారాబాద్‌, తాండూర్‌, చేవెళ్ల, షాద్‌నగర్‌, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లోని 70 మండలాల్లో 1,226 గ్రామాలకు తాగు, సాగునీరు అందనున్నది. ప్రాజెక్టు నీళ్లతో 1,546 నీటికుంటలు, చెరువులను నింపనున్నారు.