కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
  • పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
  • త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
  • సమస్యలు లేని గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం
  • గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఇబ్రహీంపట్నం, ముద్ర ప్రతినిధి: కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని, త్వరలోనే ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పునరుద్ఘాటించారు. మంచాల మండలం లోని లింగంపల్లి, బండ లేమూరు, అజ్జిన తండా గ్రామాల్లో ఎంపీపీ నర్మద, జెడ్పీటీసీ మర్రి నిత్యా రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం త్వరలోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికే రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసినట్లు గుర్తు చేశారు. వచ్చే నెలలో మరో రెండు గ్యారెంటీ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు, అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.